ఈ మధ్య ప్రెస్టీజియస్ మూవీస్‌కి టికెట్ల రేట్లు పెంపుతో పాటు, ఎక్స్‌ట్రా బెనిఫిట్ షోస్‌కీ అనుమతి లభిస్తోంది. అలా రేపు విడుదల కాబోయే 'సాహో' సినిమా ఎక్స్‌ట్రా షోస్‌కి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆగస్ట్ 30 నుండి, సెప్టెంబర్ 5 వరకూ ఈ ఎక్స్‌ట్రా షోలు నిర్వహించబడతాయి. తెల్లవారుజామున 1 గంట నుండి, ఉదయం 10 గంటల వరకూ రెండు షోల చొప్పున ఈ ఎక్స్‌ట్రా షోస్ నిర్వహించబడతాయి.
'సాహో' నిర్మాణ సంస్థ వినతి మేరకు, సాధారణంగా నిర్వహించే నాలుగు షోలు కాకుండా, అదనంగా రెండు షోలకు అనుమతి లభించింది. అయితే, టికెట్ల పెంపుకు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. కానీ, అదనపు షోలతో 'సాహో' ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేక్స్‌లా అమ్ముడుపోయాయి. కనీ వినీ ఎరుగని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
అంచనాలు ఆకాశాన్నంటిన 'సాహో' ప్రపంచ వ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున అత్యధిక ధియేటర్స్‌లో 'సాహో' విడుదలవుతోంది. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'సాహో'కి సుజిత్ దర్శకుడు. బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించింది.