గోపిచంద్ భీమా సినిమా మార్చి 8న వస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ వదిలారు. ఇందులో యాక్షన్ ఫాంటసీ ఎలిమెంట్స్ కనిపించాయి. శివుడు, అఘోరాలు, పరశురాముని క్షేత్రం అంటూ ఆధ్యాత్మిక కోణం కూడా వుంది. అయితే ఇప్పుడీ సినిమా గురించి మరో ఆసక్తికరమైన సంగతి తెలిసింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగేకథ కాదు. మొత్తం కన్నడలో జరిగే కథ. పాత్రలన్నీ కన్నడవే. వాళ్ళు మాట్లాడే భాష కూడా కన్నడనే. ప్రేక్షకుల సౌకర్యార్ధం కన్నడ మాటలని తెలుగులో వినిపిస్తున్నామనే డిస్క్లయిమర్ కూడా వేస్తారు.
ఈ సినిమా దర్శకుడు హర్ష కన్నడ వాసి. సంగీత దర్శకుడు రవి బస్రూర్, కెమరామ్యాన్ డీవోపీ స్వామి జే గౌడ.. వీరంతా కన్నడ వాసులే. మొత్తానికి భీమా సోల్ అంతా కన్నడలోనే వుంది. గోపిచంద్ గతంలో ఆంధ్రుడు అనే ఓ సినిమా చేశాడు. పేరుకి ఆంధ్రుడైన ఈ కథ మొత్తం జరిగేది బీహార్ లో. ఆ సినిమా బాగానే అలరించింది. ఇప్పుడు కన్నడ మూలాలతో వస్తున్న భీమా ఏమౌతుందో చూడాలి.