చిత్రసీమలో ప్రతిభతో పాటు అదృష్టం కూడా ముఖ్యమే అంటుంటారు. దాంతో పాటు ముందు చూపు కూడా. ఏ సినిమా ఒప్పుకోవాలి? ఏది వదులుకోవాలి? అనే విషయంలో స్థిత ప్రజ్ఞత చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఏ సినిమా వల్ల కెరీర్‌కి ప్లస్ అవుతుందో, ఏది మైనస్ గా మారుతుందో ఊహించగలగాలి. ఈ అంచనా ఎంత సరిగ్గా వేయగలిగితే, కెరీర్ అంత సవ్యంగా ఉంటుంది. ఈ విషయంలో గోపీచంద్ జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుంది. తనకు కథ చెప్పి ఒప్పించడం చాలా కష్టమన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. తను చేసిన సినిమాలన్నీ హిట్ కాకపోవొచ్చు. కానీ.. వదులుకొన్న సినిమాలు హిట్ అయిన దాఖలాలు లేవు. ఈ విషయం.. విరాట పర్వం సినిమాతో మరోసారి రుజువైంది.
విరాటపర్వంకీ, గోపీచంద్‌కీ సంబంధం ఏమిటనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. ఈ కథని ముందుగా వేణు ఉడుగుల గోపీచంద్ కి వినిపించాడట. కానీ గోపీచంద్ `నో` చెప్పాడు. ``సినిమా అంతా హీరోయిన్ చుట్టూనే తిరుగుతోంది. హీరోగా ఎవరు చేసినా... వాళ్లకు పేరేం రాదు`` అనేశాడట. ఆ తరవాత.. అది రానా దగ్గరకు వెళ్లింది. రానా ధైర్యంగా చేశాడు. కానీ... గోపీచంద్ చెప్పిందే నిజమైంది. ఈ సినిమా చూశాక సాయి పల్లవి గురించే మాట్లాడుకుంటున్నారు. రానా పేరెత్తడం లేదు. కమర్షియల్ గా కూడా ఈ సినిమా పెద్దగా సాధించిందేం లేదు. మొత్తానికి గోపీచంద్ అంచనానే కరెక్టయ్యింది. ఫలితాన్ని ముందే ఊహించిన గోపీచంద్.. ఈ సినిమా వదులుకొన్నాడు. కానీ కథని నమ్ముకొని, ఎవరికి పేరొచ్చినా పెద్దగా నష్టం లేదనుకొని రానా ఈ కథని ఒప్పుకొన్నాడు. అదే తేడా.