టాలీవుడ్ లో హిట్టే మాట్లాడుతుంది. చేతిలో హిట్టుంటే... ఏం లేకపోయినా చల్తా. అవకాశాలు వచ్చి పడిపోతుంటాయి. అడ్వాన్సుల కోసం క్యూలు కట్టేస్తారు. కానీ అదేం విచిత్రమో... చేతిలో హిట్టున్నా, ఇద్దరు దర్శకులకు అవకాశాలే రావడం లేదు. అందులో ఒకరు సాగర్ చంద్ర. ఇంకొకరు వేణు శ్రీరామ్. ఇద్దరూ పవన్ కల్యాణ్ తో చేసి హిట్లు కొట్టినవారే. అయితే ఇప్పుడు వాళ్లకు అవకాశాల్లేవు. అసలు పట్టించుకొనే నాధుడే లేడు.
పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ గా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి... వేణు శ్రీరామ్ దర్శకుడు. బాక్సాఫీసు దగ్గర వకీల్ సాబ్ బాగానే ఆడిండి. పవన్ అభిమానులకు కూడా నచ్చింది. అయితే ఆ తరవాత వేణు సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. అల్లు అర్జున్ తో ఐకాన్ చేద్దామనుకొన్నాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ కథ చాలా మంది హీరోల చేతులు మారింది. కానీ... ఇప్పటి వరకూ హీరో ఎవరన్నది ఫైనల్ కాలేదు.
పవన్ తో భీమ్లా నాయక్ తీసిన సాగర్ చంద్ర పరిస్థితీ అంతే. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. కానీ క్రెడిట్ మొత్తం.. త్రివిక్రమ్ పట్టుకెళ్లిపోయాడు. భీమ్లా నాయక్ కి అసలైన దర్శకుడు త్రివిక్రమే అని, సాగర్ చంద్ర డమ్మీనే అని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది. దానికి తగ్గట్టే.... ఈ సినిమా హిట్టుని తన ఖాతాలో వేసుకోవడంలో సాగర్ చంద్ర విఫలమయ్యాడు. అలా.. పవన్ తో సినిమాలు తీసి, హిట్లు కొట్టిన ఈ ఇద్దరు దర్శకులకూ రిక్త హస్తాలే మిగిలాయి.