విశ్వం మూవీ రివ్యూ & రేటింగ్‌

మరిన్ని వార్తలు

మూవీ: విశ్వం
దర్శకత్వం: శ్రీను వైట్ల 


కథ - రచన: గోపి మోహన్, భాను నందు, ప్రవీణ్ వర్మ. 


నటీనటులు: గోపీ చంద్, కావ్యా థాపర్, నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, VTV గణేష్, జిష్ణూ సేన్ గుప్తా, శ్యామ్, ప్రగతి, పృథ్వీ, రఘుబాబు తదితరులు       


నిర్మాతలు: వేణు దోనెపూడి,టీజీ విశ్వప్రసాద్ 


సంగీతం: చేతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ : కె.వి గుహన్
ఎడిటర్: కుడుముల అమర్ రెడ్డి


బ్యానర్: చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 11 అక్టోబర్ 2024 
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5


మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చి తరవాత విలన్ గా మారి,మళ్ళీ హీరో అయ్యాడు గోపీ చంద్. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక కెరియర్ లో వెనకపడ్డాడు. తన తోటి హీరోలు,నిన్న కాక మొన్న వచ్చిన హీరోలంతా పాన్ ఇండియా హీరోలుగా చెలామణి అవుతుంటే గోపీచంద్ ఒక్క హిట్  కోసం పరితపిస్తున్నాడు. అందుకే తన సెంటి మెంట్ ని మళ్ళీ నమ్ముకున్నాడు. గోపీ చంద్ సినిమాల టైటిల్స్ కి చివరిలో సున్నా ఉంటే హిట్ గ్యారంటీ అన్న సెంటి మెంట్ తో లక్ష్యం,రణం, శౌర్యం,లౌఖ్యం సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ ఫాలో అయ్యి 'విశ్వం'అనే టైటిల్ తో వస్తున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ లో కామెడీ జోనర్లకి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న శ్రీను వైట్ల కూడా చాలా ఏళ్లుగా హిట్స్ లేక సతమతమవుతున్నాడు. విశ్వం మూవీతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ రోజు థియేటర్స్ లో రిలీజైన 'విశ్వం'మూవీ గోపీ చంద్ కి,శ్రీను వైట్లకి కమ్ బ్యాక్ ఇచ్చిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.         


కథ:

ఓ టెర్రరిస్ట్ ఇండియాలో కొంతమందితో కలిసి బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన ఓ మినిస్టర్ ని చంపేస్తుండగా దర్శన అనే పాప చూస్తుంది. దీంతో  ఆ టెర్రరిస్టులు ఆ పాపని చంపాలని చూస్తారు. సమైరా (కావ్య థాపర్)కాస్ట్యూమ్ డిజైనర్. ఫ్యాషన్ వీక్ కోసం  సమైరా మిలాన్ వెళ్లినప్పుడు గోపి పరిచయం అవుతాడు. ప్రేమలో పడతాడు. ఆమె కోసం ఇండియా వస్తాడు. ఇండియా వచ్చిన గోపీ అనుకోకుండా ఒక రోజు దర్శనని కాపాడుతాడు. పాపని ఇంటికి తీసుకెళ్లిన గోపీ కూడా అదే ఫ్యామిలీతో ఉంటాడు. కారణం పాప సమైరా అన్న కూతురే. తనకొక లవ్ స్టోరీ ఉందని,ఆమె కోసమే వచ్చానని చెప్పి అందరితో క్లోజ్ అవుతాడు. ఇక అక్కడ నుంచి ప్రతీసారి పాపని కాపాడుతూ ఉంటాడు. చివరికి దర్శన ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులని ఆశ్రయించటంతో పోలీసులు ఆ పాపని,పాప తాతయ్యని ఓ సీక్రెట్ ప్లేస్ లో దాస్తారు. అక్కడ కూడా అటాక్ జరుగుతుంది. ఈ మధ్యలోనే గోపిని అనుమానిస్తుంది సమైరా. చివరికి గోపి ఆ పాపని కాపాడాడా? గోపి ఎందుకు ప్రతిసారి పాపని కాపాడుతున్నాడు? అసలు గోపీ ఎవరు? సమైరాతో గోపికి నిజంగానే పరిచయం ఉందా? వారిద్దరూ గతంలో ప్రేమికులా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  


విశ్లేషణ: 

శ్రీను వైట్ల తెరకెక్కించే సినిమాలో హీరోయిజం, భారీ యాక్షన్ సీన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. అన్ని కమర్షియల్ అంశాలతో కామెడీగా కథను చెప్పడంలో శ్రీను వైట్ల దిట్ట. అదే మరొక సారి నిరూపించారు. ఇప్పుడు కూడా అదే పంథాలో కమర్షియల్ ఫార్ములాతో 'విశ్వం' తెరకెక్కించారు. హీరో ఐడెంటిటీ దాచి హీరోయిన్ ఇంటికి వెళ్లడం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసాం. కథలో కొని మార్పులు చేసి కొత్త సినిమాగా జనాల మీదకి వదిలారు. చాలా రోజుల తరవాత కమెడియన్ పృథ్వీకి మంచి ఛాన్స్ దొరికింది. పృథ్వీ కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. ఎప్పటిలాగా ఈ సినిమాలో కూడా చాలా మంది కమెడియన్స్ ని వాడారు శ్రీను వైట్ల. కామెడీ పరవాలేదనిపించినా కథ విషయంలో నిరాశే మిగిల్చారు. హీరోని మార్చి దూకుడు మూవీ మళ్ళీ చేసినట్లు అనిపిస్తుంది. ఫ్యాషన్ వీక్ కి హీరోయిన్ వెళ్ళటం,ఇండియా వచ్చాక హీరోయిన్ తండ్రి పరిచయం, హీరో యాంటీ టెర్రర్టిస్ట్ స్క్వాడ్ కావడం ఇవన్నీ మహేష్ 'దూకుడు'ను గుర్తు చేస్తాయి. క్లైమాక్స్ కూడా అంత గొప్పగా ఏం లేకపోవటంతో ఆడియన్స్ కి నిరాశే మిగిలింది. 


దర్శకుడి కంఫర్ట్ జోన్ అయిన కామెడీకే పెద్ద పీఠ వేసి కథని నిర్లక్ష్యం చేసారు. ఇదేం కేవలం కామెడీ సినిమా కాదు యాక్షన్ మూవీ. టెర్రరిస్ట్ సబ్జక్ట్ తీసుకుని లాజిక్ లేకుండా ముగించేశారు. కథలో కామెడీ ఉండాలి తప్ప కథే కామెడీ కాకూడదని 'విశ్వం'మూవీ నిరూపించింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పాత్ర కూడా కామెడీగా మిగిలింది. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి. సీరియస్ కాన్సెప్ట్‌తో సినిమా మొదలు పెట్టి మొత్తం కామెడీ జోనర్ ని ఆశ్రయించారు. వెంకీ సినిమా ట్రైన్ కామెడీ ట్రాక్  వర్క్ అవుట్ అవటంతో మళ్ళీ అదే ట్రాక్ అరగంట పెట్టారు. అయితే అందులో వెంకీ మార్క్ మిస్స‌య్యింది. ఈ అర‌గంటా... ల్యాగ్ త‌ప్ప ఏం మిగ‌ల్లేదు.


నటీ నటులు:

గోపీచంద్ తన పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేసాడు. గోపీచంద్  హార్డ్ వర్క్ ఈ సినిమాలో కనిపిస్తుంది. యాక్షన్ హీరోగా ఆ కథకు,ఆ పాత్రకు న్యాయం చేసారు గోపీ చంద్. కావ్య థాపర్ గ్లామర్ డాల్ గా తన అంద చందాలతో అలరించింది. డబుల్ ఇస్మార్ట్, ఇప్పడు విశ్వంతో రెండు నెలల గ్యాపులో రెండు సినిమాల్లో గ్లామర్ ఒలికించింది. పృథ్వీ కామెడీ టైమింగ్ అదిరింది. వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్,అజయ్ ఘోష్,నరేష్,పవిత్ర,రాహుల్ రామ కృష్ణ లాంటి కమెడియన్స్ బాగానే వర్కౌట్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఇప్పటికే  జిషుసేన్ గుప్తా నటనని చూసాం. ఈసినిమాలోనూ రొటీన్ విల‌నిజంతో విసుగెత్తించాడు. ఆఖరికి సునీల్ పాత్ర కూడా పండ‌లేదు. ప్రియా వడ్లమాని, ముకేశ్ రిషి,శ్యామ్ అతిథి పాత్ర‌ల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. 


టెక్నికల్ :

శ్రీను వైట్ల కామెడీ విష‌యంలో అక్క‌డ‌క్క‌డ‌ తన మార్క్ చూపించారు. కానీ పూర్తిగా మాత్రం కాదు. కొత్త కథ ట్రై చేసి ఉంటే గ్యారంటీ హిట్ కొట్టేవారేమో. కెవి గుహన్  సినిమాటోగ్రఫీ విజువల్స్ సూపర్ గా ఉన్నాయి. చేతన్ భరద్వాజ్ అందించిన సంగీతం పాటల్లో మెప్పించలేకపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరవాలేదనిపిస్తుంది. భీమ్స్ కంపోజ్ చేసిన 'గుంగురూ గుంగురూ' మాస్ బీట్. అయితే ప్లేస్‌మెంట్ బాలేదు. పాటలు ఏవి నోటెడ్ కావు. మంచి లొకేషన్స్ లో షూట్ చేసారు. ఇటలీ,కశ్మీర్,గోవా లాంటి ప్రాంతాల్లో మంచి మంచి  లొకేషన్స్ తెర‌కెక్కించ‌డం వ‌ల్ల విజువ‌ల్ గా సినిమా బాగుంది. గ్రాఫిక్స్ వర్క్ చాలా పేలవంగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఎడిటింగ్ విష‌యానికొస్తే ట్రిమ్ చేయాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి.


ప్లస్ పాయింట్స్ 

గోపీచంద్ 
నటీ నటులు 
కామెడీ  
సినిమాటోగ్రఫీ 


మైనస్ పాయింట్స్ 

రొటీన్ కథ
దర్శకుడు 
పాటలు 
ఎడిటింగ్  

 

ఫైనల్ వర్దిక్ట్: ఆడియన్స్ విశ్వాసం గెలవలేని 'విశ్వం'


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS