లాన్ డౌన్ 4.0 ద్వారా చిత్రసీమకు కొన్ని సడలింపులు వస్తాయని, త్వరలోనే థియేటర్లు తెరచుకుంటాయని, షూటింగులకు అనుమతులు వస్తాయని భావించారు నిర్మాతలు. దానికి తోడు గత రెండు రోజులుగా.. షూటింగులకు పర్మిషన్లు ఇవ్వడం ఖాయమని, జూన్ 1 నుంచి థియేటర్లు తెరచుకుంటాయని భారీగా ప్రచారం సాగుతోంది. దాంతో నిర్మాతలు షూటింగులు చేసుకోవడానికి రెడీ అయ్యారు. అయితే.. లాక్ డౌన్ 4.0లో సినిమాలకు మరోసారి మొండి చేయి ఎదురైందని తెలుస్తోంది. ఈసారి కూడా థియేటర్లకు అనుమతులు లేవని సమాచారం. షూటింగుల విషయంలోనూ ఎలాంటి సడలింపులు లేవని తెలుస్తోంది.
థియేటర్లు ఓపెన్ అయితే, జన సమూహాలు పెరిగి.. కరోనా మరింతగా విజృంభించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భయపడుతోంది. అందుకే జన సమూహాలకు ఎక్కువ ఆస్కారం ఇచ్చే సినిమాలు, షాపింగు మాల్స్‌లకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించుకుందని సమాచారం. మరో రెండు మూడు నెలల వరకూ థియేటర్లు తెరచుకునే ప్రసక్తి లేదని తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్రసీమకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.
థియేటర్లు తెరచుకుంటే సినిమాలు విడుదల చేద్దామని ఎదురు చూసిన నిర్మాతలకు ఇది షాకింగ్ విషయమే. ఓటీటీ సంస్థలు వెంటపడుతున్నా సినిమాని అమ్ముకోని నిర్మాతలకు ఇప్పుడు ఓటీటీ మినహా మరో మార్గం లేకుండా పోయింది. మరో రెండు నెలలు థియేటర్లు తెరచుకోవంటే... పెద్ద నష్టమే. అప్పటి వరకూ తమ సినిమాలు విడుదల కావంటే, ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిందే.