నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' ఎంత సూపర్ హిట్టయ్యిందో తెలిసిందే. ఈ షోతో బాలయ్యకు కొత్త ఇమేజ్ వచ్చింది. బాలయ్య కు ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఏర్పడింది. ఆహాకు భారీ లాభాల్ని ఆర్జించి పెట్టింది. ఇప్పుడు సీజన్ 2కి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈసారి మరింత మంది క్రేజీ సెలబ్రెటీలతో ఈ షోకి వన్నె తీసుకురావాలని ఆహా భావిస్తోంది. ఈ షోకి పవన్ - త్రివిక్రమ్‌లను ఆహ్వానిస్తున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదెంత నిజమో తెలీదు గానీ.. ఈసారి మాత్రం హీరోయిన్లు ఎక్కువగా సందడి చేసే అవకాశం ఉందని టాక్.
సీజన్ 1లో.. అంతా హీరోలే కనిపించారు. హీరోయిన్లకు ఛాన్స్ దొరకలేదు. ఈసారి అలా కాదట. హీరోయిన్లను కూడా ఈ షోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తోంది. అనుష్క, సమంత పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సమంత ఆహా కోసం ఓ షో చేసింది. కాబట్టి.. ఇప్పుడు ఈ టాక్ షోకి పిలిస్తే కాదనకుండా వస్తుంది. కాకపోతే.. విడాకుల వ్యవహారం తరవాత... మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని భావిస్తోంది సమంత. కాఫీ విత్ కరణ్ లో తన అభిప్రాయాల్ని బాహాటంగానే చెప్పేసిన నేపథ్యంలో బాలయ్య షోకి రావడానికి తనకేం అభ్యంతరాలు ఉండకపోవొచ్చు. అనుష్కతో పాటు సమంత కూడా ఈ షోకి వస్తే కొత్త గ్లామర్ అబ్బినట్టే.