దిగ్గజ గాయకుడు ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ మరోసారి గట్టిగా వినిపిస్తోంది. ఇది ఆయన శత జయంతి సంవత్సరం. డిసెంబరు 4 నాటికి ఆయనకు వందేళ్లు పూర్తవుతాయి. ఆ సమయానికి ఘంటసాలకు భారత రత్న ప్రకటిస్తే... సముచితంగా ఉంటుందన్నది ఆయన అభిమానుల కోరిక. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈసారి.. ఇంకాస్త గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా అమెరికాలో ఉన్నకొన్ని తెలుగు సంఘాలు.. ఈ విషయమే ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నాయి. అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాలన్నీ ఏకమై... కేంద్ర ప్రభుత్వానికి తమ గళాన్ని వినిపించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు... ఓ కాంపెయిన్ నిర్వహించాలని భావిస్తున్నారు. తెలుగు నాట నుంచి దర్శకులు, సంగీత దర్శకులు, గాయకులు, సినీ నటులు.. అంతా ఏకమై... కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని అప్పుడే ఘంటసాలకు భారతరత్న సాధ్యమన్నది అందరి వాదన.
నిజానికి ఘంటసాలకు భారత రత్న ఎప్పుడో ఇవ్వాల్సింది. రకరకాల రాజకీయ సమీకరణాల వల్ల ఆలస్యమైంది. భారతరత్న లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు రాబట్టాలంటే రాష్ట్రాల నుంచి ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది. సినిమా వాళ్లకు అవార్డుల విషయంలో తెలుగు రాష్ట్రాలు ఈమధ్య మరీ... నిత్తేజంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సిన పురస్కారాలే రావడం లేదు.
ఇక కేంద్రంపై ఏమాత్రం ఒత్తిడి తీసుకురాగలరు? లాబీయింగ్‌లు చేస్తే తప్ప అవార్డులు రాని పరిస్థితి. అలాంటప్పుడు మన మధ్య లేని ఘంటసాల గురించి పోరాడే ఓపిక, తీరిక ఎవరికి ఉంటుంది..? సినిమా స్టార్లే ఇప్పుడు ఘంటసాల గురించి మాట్లాడడం లేదు. ఒకరిద్దరు మైకు పట్టుకొని `ఘంటసాలకు అవార్డు ఇస్తారా, లేదా` అని నినదిస్తే ఆ పిలుపు కేంద్రం వరకూ చేరుతుందా..? ఘంటసాలకు భారత రత్న ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన శత జయంతిని పురస్కరించుకొని, కనీసం ఆయన్ని గౌరవించుకొనేలా తెలుగు వాళ్లు ఓ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది. కనీసం అదైనా చేయగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.