ఆర్.ఎక్స్ 100 లాంటి బోల్డ్ లవ్ స్టోరీతో హిట్టు కొట్టి, తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో కార్తికేయ తదుపరి 'హిప్పీ' చిత్రం తో ప్లాప్ చవి చూసాడు. అయినా ఏ మాత్రం తగ్గకుండా మరో కమర్షియల్ ఫార్ములాతో ముందుకొచ్చాడు. అదే 'గుణ 369'. బోయపాటి శ్రీను శిష్యుడు 'అర్జున్ జంధ్యాల' దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. విడుదలైన అన్నీ చోట్ల మంచి కలక్షన్ల తో సాగుతుంది. ఈ సక్సెస్ చూసి, తనకు మరో విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు హీరో కార్తికేయ.
ఇదిలా ఉంటే తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆసక్తికరమైన వార్త ఒకటి షేర్ చేసాడు ఈ యంగ్ హీరో. తన తరువాత చిత్రంకు సంబంధించిన న్యూస్ ఇది. ఆ చిత్రం ఎవరితో చేయబోతున్నాడో అన్నది రివీల్ చేసేసాడు కార్తికేయ. గుణ 369 తో తనలోని మాస్ యాంగిల్ ని బయటకి తీసి మంచి హిట్ అందించిన అర్జున్ జంధ్యాల తోనే కార్తికేయ 4వ చిత్రం ఉండబోతుందట. అది ఎప్పుడు మొదలవుతుందో త్వరలోనే వెల్లడిస్తాను అని చెప్పాడు కార్తికేయ. ఈ చిత్రం సక్సెస్ ను ఎప్పటికీ మరువలేనని, దీన్ని తలకి ఎక్కించుకోకుండా ఇకనుంచి ప్రతి చిత్రానికి నూటికి నూరు శాతం శ్రమిస్తానని చెప్పాడు.