ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ (71)కన్నుమూశారు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం వేకువజామున గుండెపోటుతో మరణించారు. దీంతో యావత్ చిత్ర పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేలకు పైగా సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి.
తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన ‘చూడాలని ఉంది’ చిత్రంలో ‘ఓ మారియా.. ఓ మారియా’ పాటకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్. ``సరోజ్‌ఖాన్ గారితో 1998లో వచ్చిన ‘చూడాలని ఉంది’ సినిమా కోసం వర్క్ చేయడం జరిగింది. ఆ సినిమాలో రెండు పాటలకి ఆమె కొరియోగ్రఫి చేశారు. ముందుగా ‘ఓ మారియా.. ఓ మారియా’ పాట సరోజ్‌ఖాన్ గారితో చేద్దామనుకుంటున్నాను అని అశ్విని దత్ గారితో చెప్పగానే ఆయనకు ఆమెతో ఉన్న అనుబంధంతో నేను వెళ్లి మాట్లాడతాను అని చెప్పారు. అప్పటికే ఇండియాలోనే బిజీ కొరియోగ్రాఫర్ అయినప్పటికీ చిరంజీవిగారి సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యి ఒప్పుకున్నారు. ఎందుకంటే చిరంజీవిగారు కొరియోగ్రాఫర్స్ తాలుకు ఎఫర్ట్‌ని తన డ్యాన్స్ మూమెంట్స్‌తో వందరెట్లు ఎక్కువ చేస్తారు.
నేను, మణిశర్మ సినీ కెరీర్ ప్రారంభించిన తొలి రోజులు అవి. పాట వినగానే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని సరోజ్‌ఖాన్ గారు అడిగారు. మణిశర్మ అనే అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశారు అనగానే ఆ రిథమ్స్ నచ్చి భవిష్యత్తులో తప్పకుండా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అని చెప్పారు. అలాగే హైదరాబాద్ రాగానే తోట తరణి గారి సెట్ ని బాగా లైక్ చేశారు. అది నా నాలుగవ సినిమా. కెరీర్ తొలినాళ్లలోనే మెగాస్టార్‌తో సినిమా అంటే అదోక అచీవ్‌మెంట్. దాంతో క్యాస్టింగ్, ఫోటోగ్రఫి, ఆర్ట్ మీద నేను పెట్టిన శ్రద్దని ఆమె మెచ్చుకొని నన్ను చాలా ప్రోత్సహించారు. అలాగే ఓ మారియా.. ఓ మారియా’ పాటకు ఆమె కొరియోగ్రఫీ చేస్తోన్న విధానానికి, దానికి చిరంజీవిగారి డ్యాన్స్ స్కిల్స్‌కి యూనిట్ సభ్యులు షాట్ షాట్ కి క్లాప్స్ కొట్టేవారు. మా టీమ్ అందరం ఎంత ఎంజాయ్‌చేస్తూ ఆ పాటను చేశామో.. సినిమా విడుదలైన తర్వాత ఆ పాటకు ఆడియన్స్ అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఆ పాటకు ప్రభుత్వం వారు సరోజ్‌ఖాన్ గారికి నంది అవార్డు కూడా ఇవ్వడం జరిగింది.
ఆమె డ్యాన్స్ మూమెంట్స్‌ని ఎంత బాగా కంపోజ్ చేస్తారో ఎక్స్‌ప్రెషన్స్‌ని అంత బాగా క్యాప్చర్ చేస్తారు. దాంతో అబ్బబ్బా ముద్దు..సాంగ్‌కి కూడా ఆమె కొరియోగ్రఫి చేస్తే బాగుంటుందని దత్తుగారితో చెప్పి ఆ పాట కూడా ఆమెతోనే కొరియోగ్రఫి చేపించడం జరిగింది. ఆ పాటలో సౌందర్యగారి ఎక్స్‌ప్రెషన్స్‌కి, అలాగే చిరంజీవి గారి గ్రేస్ మూమెంట్స్‌కి ప్రేక్షకులు మరోసారి అంతే గొప్ప అనుభూతికి లోనైయ్యారు. ఆ పాట అప్పటికి ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది అని చెప్పవచ్చు. ఆ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పటికే లెజెండరీ కొరియోగ్రాఫర్ అయిన కొత్తవారికి ఆమె ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ఆవిడ ఈ రోజు మనమధ్యలేక పోవడం కేవలం మన తెలుగు ఇండస్ట్రీకే కాదు ఇండియన్ సినిమాకే లోటు. ఆవిడ ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్దిస్తున్నాను`` అన్నారు.