గుణశేఖర్... తెలుగునాట క్రియేటీవ్ డైరెక్టర్లలో ఒకడు. ఈరోజు (బుధవారం) తన పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు గుణశేఖర్. అందులో భాగంగా తన కొత్త సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా `రుద్రమదేవి`కి సీక్వెల్ చేస్తానని ప్రకటించడం... టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. అనుష్క ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం `రుద్రమదేవి`. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి గానీ, బాక్సాఫీసు దగ్గర వసూళ్లు కురవలేదు. చచ్చీ, చెడీ.. స్వల్ప నష్టాలతో.. గుణ గట్టెక్కాడు.
అయితే.. `రుద్రమదేవి`కి ఇప్పుడు సీక్వెల్ తీస్తాననడం నిజంగా తన సాహసమే. ఈ సీక్వెల్ కి `ప్రతాపరుద్ర` అనే పేరు ఖరారు చేశాడు. చరిత్ర పాఠాలు చదివిన వారికి ప్రతాపరుద్రుడుని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. తను...రుద్రమదేవి మనవడు. ధైర్య సాహసాల్లో.. రుద్రమకు ఏమాత్రం తీసిపోడు. తనతోనే కాకతీయ సామ్రాజ్యం అంతమొందింది. ఈ ప్రతాప రుద్రుడుగా ఓ స్టార్ హీరో కనిపించే అవకాశం ఉంది. అయితే.. ఈసినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా సమయం ఉంది. ప్రస్తుతం `శాకుంతలమ్`తో బిజీగా ఉన్నాడు గుణశేఖర్. ఆ తరవాత... `హిరణ్య కశ్యప` ఉంటుంది. ఆ తరవాతే.. ప్రతాప రుద్రుడు మొదలవుతుంది.