మల్టీస్టారర్‌ల హవా బాగా పెరిగింది. స్టార్ హీరోలు మల్టీస్టారర్లు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ నటిస్తున్న `ఆర్.ఆర్.ఆర్` ఓ భారీ మల్టీస్టారర్. ఓరకంగా `ఆచార్య` కూడా మల్టీస్టారర్ కిందే లెక్క. ఇప్పుడు రామ్ చరణ్ మరో మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టబోతున్నట్టు టాక్. మలమాళంలో ఘన విజయం సాధించిన చిత్రం `డ్రైవింగ్ లైసెన్స్`. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.
ఈ రీమేక్ రైట్స్ వెంకటేష్ చేతికి చేరాయని వార్తలొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్ ఈ సినిమాని రీమేక్ చేస్తుందని అనుకున్నారు. ఇప్పుడు దాన్నిమించి పోయే వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాని తెలుగులో రవితేజ, రామ్ చరణ్ కలసి చేయబోతున్నార్ట. అంతే కాదు... కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమాని రామ్ చరణే స్వయంగా నిర్మించబోతున్నాడట. అదే జరిగితే... టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ కి రంగం సిద్ధమైనట్టే. అయితే.. చరణ్, రవితేజల దగ్గర అంత టైమ్ ఉందా? అనేది డౌటు.
రవితేజ వరుస సినిమాలతో బిజీ. రామ్ చరణ్ ఆల్రెడీ శంకర్ కి డేట్లు ఇచ్చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ పై మరీ మమకారం పెరిగిపోయి, డేట్లు సర్దుబాటు చేసుకుని ఈ సినిమా చేసినట్టైతే.. నిజంగా రచ్చ రచ్చే. కానీ.... ఇవన్నీ జరిగే విషయాలేనా? అనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతానికి ఈ వార్త మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.