థియేటర్లు లేకపోవడంతో ఓటీటీ సంస్థలే పెద్ద దిక్కుగా మారాయి. సినిమా విడుదల అవ్వాలంటే ఇప్పుడు ఓటీటీ సంస్థలను సంప్రదించాల్సిందే. వాళ్లకు సినిమా నచ్చితే.. డబ్బులే డబ్బులు. ఇటీవల కాలంలో దాదాపు పది సినిమాల వరకూ నేరుగా ఓటీటీలోకి విడుదలయ్యాయి. వాటి ఫలితాలు ఎలా ఉన్నా, నిర్మాతలకు బాగానే గిట్టుబాటు అయ్యింది. ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోంది,. అదే.. గుంజన్ సక్సేనా.
శ్రీదేవి కుమార్తె, జాన్వి కపూర్ నటించిన సినిమా ఇది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను పొందింది. ఆ రూపంలో నిర్మాతలకు 70 కోట్లు వచ్చాయని టాక్. అయితే ఈ సినిమా బడ్జెట్ కేవలం 30 కోట్లేనట. అంటే.. దాదాపుగా 40 కోట్ల లాభమన్నమాట. కార్గిల్ యుద్ధంలో యుద్ధంలో పాల్గొన్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా బయోపిక్ ఇది. ఆ పాత్రలో జాన్వీ నటించింది. శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మార్చి 13న విడుదల చేయాలనుకున్నారు. ఆ తరువాత ఏప్రిల్ 24కు వాయిదా వేశారు. కరోనాతో థియేటర్లు మూతపడటంతో విడుదల సాధ్యపడలేదు. చివరికి నెట్ ఫ్లిక్స్ చేతికి వెళ్లింది. అయితే నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు చేయలేదు.