విడుదల తేదీ: డిసెంబర్ 17, 2020
నటీనటులు : సత్యదేవ్ కాంచరన, ప్రియ లాల్, ప్రియదర్శి
దర్శకత్వం : మోహన్ బమ్మిడి
నిర్మాతలు : బి. జీవన్ రెడ్డి, కోసనం దాము రెడ్డి
సంగీతం : బొబ్బిలి సురేష్
రేటింగ్: 1.5/5
హీరో - హీరోయిన్లు చూసుకోకుండా ప్రేమించుకోవడం..
సినిమా చివర్నో కలుసుకోవడం - `ప్రేమలేఖ` సినిమా నాటి రోజులు. నిజంగా అలాంటి లవ్ స్టోరీలు ఎప్పుడు చూసినా థ్రిల్లింగ్ గానే అనిపిస్తాయి. సెల్ ఫోన్, ఇంటర్నెట్ లేని రోజుల్లో అలాంటి ప్రేమకథలు నడపడం ఈజీనే. కానీ ఇప్పుడే కష్టం. ఇంటర్నెట్ యుగంలో కూడా ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకుంటారా? అలాంటి ప్రేమ నిలబడుతుందా? నిలబడినా గెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే `గువ్వ - గోరింక` చూడాలి. సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ఎప్పుడో పూర్తయినా, విడుదలకు నోచుకోలేదు. ఇన్నాళ్లకు అమేజాన్ ప్రైమ్‌లో దర్శనమిచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుంది? రిలీజ్ లేట్ అయినా, సినిమాలో లెటెస్ట్ విషయాలున్నాయా?
* కథ
సదానంద్ (సత్యదేవ్) కి సౌండ్ అంటే అస్సలు పడదు. పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉండాలి. చెవుల్లో దూది పెట్టుకుని తిరుగుతుంటాడు. తనో మెకానికల్ ఇంజనీర్. శబ్దం చేయని వాహనం కనిపెట్టాలని చూస్తుంటాడు. మరోవైపు శిరీష (ప్రియాలాల్) కథ. తనకు వయెలిన్ అంటే ప్రాణం. సంగీతంలో మాస్టర్ డిగ్రీ తీసుకోవాలని కలలు కంటుంటుంది. ఇద్దరూ ఒకే అపార్ట్ మెంట్ లో పక్క పక్క ఫ్లాట్స్‌లో ఉంటారు. అయితే... శిరీష్ వయెలిన్ శబ్దం.. సదానంద్ ని విసిగిస్తుంటుంది. శిరీషని ఆ ఫ్లాట్ నుంచి తరిమేయాలని రకరకాల ట్రిక్కులతో భయపెడతాడు. కానీ మెల్లగా సదానంద్, శిరీష ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అదీ చూసుకోకుండానే. ఆ తరవాత.. ప్రేమలో పడతారు. ఇది కూడా చూసుకోకుండానే. పక్క పక్క ఫ్లాట్స్ లో ఉన్న వీరిద్దరూ చూసుకోకుండా ఎలా ప్రేమలో పడ్డారు? ఈ ప్రేమలో ఎలాంటి అవరోధాలు వచ్చాయి? అనేది మిగిలిన కథ.
* విశ్లేషణ
చూసుకోకుండా ప్రేమించడం అనేది కొత్త పాయింట్ కాదు. కానీ ఈతరానికి కొత్తదే. సెల్ ఫోన్, ఇంటర్నెట్ యుగంలో కూడా చూసుకోకుండా ఎలా ప్రేమించుకుంటారు? అలా ఓ ప్రేమకథ నడపొచ్చా? అనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టి ఉండొచ్చు. ఒకరికి శబ్దం అంటే పడదు, ఇంకొకరికి సంగీతమే ప్రాణం. ఇద్దరి మధ్య ఓ లవ్ స్టోరీ నడపాలన్న ఆలోచన కొత్తదే. అయితే.. దాన్ని సరైన రీతిలో ప్రజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు. కథనంలో ఎలాంటి మ్యాజిక్కూ లేదు. సన్నివేశాల సాగదీత తప్ప ఇంకేం కనిపించదు. తొలి సన్నివేశాలు చూస్తే.. ఇదేమైనా హారర్ సినిమానా? అన్న అనుమానం వస్తుంది. కుర్చీలు కదలడం, గడియారం ముల్లు ఫాస్టుగా తిరడం.. ఇలాంటి ట్రిక్కులతో హారర్ సినిమా ఫీలింగ్ తీసుకొచ్చారు. ఆ తరవాత.. సదానంద్, శిరీష ప్రేమకథ మొదలవుతుంది. ఆ ప్రేమ మొదలైన విధానం కాస్త ఇంట్రస్టింగ్‌గానే ఉన్నా, ఆ తరవాత తరవాత... విసుగు మొదలవుతుంది.
గ్యారేజీలోని సన్నివేశాల్ని కామెడీ కోసం రాసుకున్నా, అందులోంచి వినోదం పండలేదు. సినిమా నిడివిని పెంచుకోవడానికి తప్ప ఆయా సన్నివేశాలు ఎందుకూ పనికిరాలేదు. బిత్తిరి సత్తితో అర్జున్ రెడ్డి స్నూఫ్ చేయిద్దామనుకుని భంగపడ్డారు. మంగ్లీ తో సీన్ అయితే మరింత అనవసరం అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య కాన్లిఫ్ట్ కూడా బలంగా రాసుకోలేదు. వాళ్లిద్దరూ ప్రేమలో పడినా, గొడవపడినా ఆ కథతో ప్రేక్షకుడు ట్రావెల్ చేయలేదు. దాంతో.. తెరపై ఎమోషన్ సీన్లు నడుస్తున్నా, అవన్నీ ప్రేక్షకుడితో ఏమాత్రం సంబంధం లేకుండా సాగినట్టే అనిపిస్తాయి.
మరోవైపు లివింగ్ టుగెదర్ అంటూ మరో జంట కథ చెప్పారు. ఆ కథనీ పైపైనే టచ్ చేసుకుంటూ వెళ్లారు. చూసుకోకుండా ప్రేమించుకుంటున్న ప్రేమ, కలిసున్నా ప్రేమని ఆస్వాదించలేని మరో ప్రేమ.. వీటి మధ్య డిబేట్ జరిగినట్టు అనిపించింది తప్ప, ఓ ఫీల్ గుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ రాలేదు. దాంతో రెండు గంటల సినిమా కూడా.. రెండు సీరియల్స్‌ని బలవంతంగా చూస్తున్న భావన కలిగించింది.
* నటీనటులు
సత్యదేవ్ చాలా మంచి నటుడు. ఈ విషయం ఎప్పుడో నిరూపితమైంది. అయితే తనలోని ప్రతిభని ఏమాత్రం మెరుగుపరచ్చలేని పాత్ర ఇది. నూటికి నూరు శాతం వాడుకునే ఛాన్స్ కూడా ఈ క్యారెక్టర్ ఇవ్వలేకపోయింది. పైగా.. ఒక్కో సీన్ లో తను ఒక్కోలా కనిపించాడు. ప్రియలాల్ ని ఎందుకు హీరోయిన్ గా తీసుకున్నారో అర్థం కాదు. ప్రియదర్శి కామెడీ టైమింగ్ ఈ సినిమా వరకూ గాలికి కొట్టుకెళ్లిపోయింది. మిగిలినవాళ్లందరివీ చిన్న చిన్న పాత్రలే.
* సాంకేతిక వర్గం
సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. కొన్ని పాటలు ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ కథలోని బలహీనతని కప్పిపుచ్చలేకపోయాయి. పాయింట్ వరకూ కొత్తగానే అనిపించినా, దాన్ని తెరపై తీసుకురావడంలో దర్శకుడు తడబడ్డాడు. అతి తక్కువ లొకేషన్లలో సినిమాని నడపడం వల్ల.. చూసిన సన్నివేశమే మళ్లా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నీరసమైన కథనం, సీరియల్ టైపు టేకింగ్ తో రెండు గంటల పాటు విసుగుని విసుగు లేకుండా అందించాడు దర్శకుడు.
* ప్లస్ పాయింట్స్
టైటిల్
సత్యదేవ్
కథలోని మెయిన్ పాయింట్
* మైనస్ పాయింట్స్
కథనం
హీరోయిన్
లవ్ స్టోరీలో సంఘర్షణ లేకపోవడం
* ఫైనల్ వర్డిక్ట్: బోరింగ్ లవ్ స్టోరీ