హీరోయిన్ హంసా నందిని క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. 2020లో ఆమెకు గ్రేడ్ 3 కార్సినోమా వుందని తేలింది. దానినికి చికిత్స తీసుకుంటున్న సమయంలోనే BRCA1 (వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్) పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీనిని ఎదురుకోవడానికి ఇంటన్సివ్ ఇన్వాసివ్ ప్రొఫిలాక్టిక్ సర్జరీని కూడా చేయించుకొని ప్రస్తుతం ఆరోగ్యంగా వున్నారమె. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడిన తన ప్రయాణాన్ని పంచుకున్నారు హంసా నందిని.
''క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత ఒక్కసారిగా అంతా చీకటైపోయింది. చాలా కఠినమైన పరీక్షలు, ట్రీట్మెంట్ ని ఎక్కడా ధైర్యం కోల్పోకుండా తీసుకున్నా. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ చిరునవ్వుతో పోరాడా. ఈ ప్రయాణంలో మూడు విషయాలు తెలుసుకున్నా. క్యాన్సర్ ని ఎదురుకోవాలంటే రోగనిర్ధారణ, సమర్థులైన వైద్యులు, కుటుంబ, పాజిటివ్ మనస్తత్వం అవసరం. అవే తిరిగి మామూలు స్థితికి తీసుకొస్తాయి’’ అని చెప్పారు హంసా నందిని. అన్నట్టు క్యాన్సర్ బారిన పడి మరణించిన తన తల్లి పేరు మీద 'యామినీ క్యాన్సర్ ఫౌండేషన్' నెలకొల్పి క్యాన్సర్ పై దేశం అంతా అవగాహన కల్పించడానికి తన వంతుగా ప్రయత్నిస్తున్నారు హంసానందిని.