ఇటీవల ప్రముఖ నటి ఖుష్బూ తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల వయసులోనే తన తండ్రి తనని లైంగికంగా వేధించాడని, పదహారేళ్లకు తిరగబడితే.. ఇల్లు వదిలి పారిపోయాడంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తండ్రి తనపై చేసిన లైంగిక దాడి గురించి ఖుష్బూ చెప్పడం ఆమె గుండె ధైర్యానికి నిదర్శనం అంటూ కొందరు మెచ్చుకొంటున్నారు. ఇంకొంతమంది.. ఇంత ఆలస్యంగా ఎందుకు చెప్పావు? ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇవి ఖుష్బూ దృష్టికీ వెళ్లినట్టున్నాయి. అందుకే వీటిపై మరోసారి స్పందించింది.
తన తండ్రి చేసిన ఘనకార్యం చెప్పడానికి తానేమీ సిగ్గు పడడం లేదని, సిగ్గు పడాల్సిన వ్యక్తి తన తండ్రని, కాస్త ఆలస్యమైనా నిజమెంటో బయటపెట్టానని, మహిళలాంతా ఇలాంటి దురాగతాలపై ధైర్యంగా పోరాడాలని హితవు చెప్పింది. ''నాకు జరిగిన అన్యాయం గురించి నలుగురికీ చెప్పడానికి నేను సమయం తీసుకొని ఉండొచ్చు. ప్రతీ ఒక్కరూ తమకు ఎదురైన వేధింపుల గురించి ఎప్పుడో ఒకప్పుడు నోరు విప్పాల్సిందే. దాని వల్ల.. ఇంకొతమంది ఎలెర్ట్ అవుతారు. తమ పోరాటాన్ని కొనసాగిస్తారు'' అని వివరణ ఇచ్చింది ఈ సీనియర్ నటి.