క్యూట్ బ్యూటీ హన్సిక నటిస్తున్న తాజా చిత్రం 'మహా'. డిఫరెంట్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌లో హన్సిక గెటప్ వివాదాస్పదంగా ఉందని కొందరు ఆమెపై కేసు నమోదు చేశారు. కాషాయ వస్త్రాలు ధరించి దమ్ము కొడుతున్నట్లు ఉన్న హన్సిక గెటప్ కొందరి మనోభావాల్ని దెబ్బ తీసే విధంగా ఉండడంతో ఆ సీన్‌ని తొలగించాలంటూ డైరెక్టర్ పైనా, హన్సిక పైనా కేసు నమోదు చేశారు.
అయితే ఆ వివాదంపై 'మహా' డైరెక్టర్ యు. ఆర్. జమీల్ స్పందించారు. కొత్తదనం కోసమే అలా ట్రై చేశామనీ, అంతకు మించి కుల, మతాల పరంగా ఎవర్నీ కించపరచడం తమ ఉద్దేశ్యం కాదనీ ఆయన వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌ని హన్సిక రీ ట్వీట్ చేసింది. గతంలో 'సర్కార్' సినిమాకి సంబంధించి విడుదలైన ఓ పోస్టర్‌లో విజయ్ కూడా ఇలాగే దమ్ము కొడుతూ కనిపించడంతో, సమాజానికి ఏం సంకేతాలిస్తున్నారు అంటూ అప్పుడు కూడా ఇలాగే వివాదం లేవనెత్తారు.
స్టార్‌డమ్ ఉన్న వ్యక్తులు ఇలాంటి పోస్టర్స్‌లో కనిపించడం ద్వారా సమాజానికి అది చెడు సంకేతాల్ని పంపినట్లవుతుంది. బాడీలాంగ్వేజ్‌లో స్టైల్ చూపించొచ్చు. కానీ ఇలా చెడు అలవాట్లను ప్రేరేపించే పోస్టర్లు పబ్లిగ్గా ప్రమోట్ చేయడం తగదని ఆందోళనకారుల ఉద్దేశ్యం. ఇదిలా ఉంటే, సినిమాల భాషలో చెప్పాలంటే, వివాదాల్లోకెక్కిన సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటుండడం ఇప్పుడు మనం చూస్తున్నాం. అలా హన్సిక 50వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ 'మహా' హన్సికకు మహా సక్సెస్‌నిస్తుందేమో చూడాలి.