మామూలుగా అయితే 'రక్తపు మడుగులో' అన్న మాట ఆయా వ్యక్తులకు తీవ్ర గాయాలై విపరీతమైన రక్తస్రావం జరిగినప్పుడు వాడతాం. కానీ ఇక్కడ, అందాల భామ హన్సిక రక్తపు మడుగులో స్నానం చేస్తోంది. ఇదంతా హన్సిక కొత్త సినిమా 'మహా' లేటెస్ట్ లుక్ వ్యవహారం. ఈ సినిమాలో హన్సిక విభిన్న పాత్రల్లో కన్పించబోతోంది. ఇదొక థ్రిల్లర్ అని ఇప్పటిదాకా విడుదలైన లుక్స్‌ని బట్టి అర్థమవుతోంది. హన్సిక కెరీర్లోనే ఇదొక డిఫరెంట్ ఫిలిం అట.
సాధారణంగా 'డిఫరెంట్ రోల్' అని చెప్పేస్తుంటారుగానీ, ఇది నిఖార్సయిన డిఫరెంట్ మూవీ అని హన్సిక అంటోంది. కెరీర్లో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా వుందనీ, ఇకపై చేసే సినిమాలన్నీ ప్రయోగాత్మకంగానే వుంటాయనీ, అప్పుడప్పుడూ కమర్షియల్ సినిమాలు చేస్తాననీ హన్సిక అంటోంది. 'దేశముదురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిమితమైన హన్సిక, ప్రస్తుతం ఎక్కువగా తమిళ సినిమాలకే పరిమితమైపోయింది.
అప్పుడప్పుడూ మాత్రం తెలుగు తెరపై కన్పిస్తూనే వుంది. 'మహా' సినిమాని తమిళంతోపాటు, తెలుగులోనూ విడుదల చేస్తారు. ఇతర భాషల్లోకీ సినిమాని అనువదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇదిలా వుంటే, విభిన్న రకాలైన గెటప్స్ ఒకే సినిమాలో చేయాల్సి రావడం ఒత్తిడితో కూడుకున్నదే అయినా, అన్నిటికీ సిద్ధపడి ఈ సినిమా చేస్తున్నానని హన్సిక చెప్పింది.