శ్రీరాముడికి నమ్మిన బంటు.. హనుమంతుడు. రాముడు ఏం చెబితే... హనుమంతుడు అది చేస్తాడు. కానీ ఇప్పుడు రామ హనుమాన్‌ల యుద్ధం జరుగుతోంది. పురాణాల్లో కాదు. వెండి తెరపై. ప్రభాస్ నటించిన చిత్రం `ఆదిపురుష్`ని ఇప్పుడు సినీ అభిమానులు `హమ-మాన్`తో పోల్చి.. చీల్చి చెండాడుతున్నారు. ఈ రెండింటికీ సంబంధం ఏమిటనే కదా? అనుమానం..? అక్కడికే వెళ్దాం.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ బడ్జెట్ దాదాపుగా రూ.400 కోట్లని భోగట్టా. ఈ టీజర్ ఇటీవలే చూశాం. అది చూసి ప్రభాస్ అభిమానులు సైతం పెదవి విరిచారు. ఇదేం గ్రాఫిక్స్ రా బాబూ.. అనుకొన్నారు. దాంతో.. చిత్ర బృందం గ్రాఫిక్స్ ని రీ డిజైన్ చేయాలని నిర్ణయించుకొంది. అందుకు మరో రూ.100 కోట్లు ఖర్చు పెట్టబోతోంది.
నిన్న హను - మాన్ అనే ఓ చిన్న సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చింది. దాని బడ్జెట్ రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకూ ఉంటుంది. అందులోని విజువల్ ఎఫెక్ట్స్ చూసి కళ్లు తేలేస్తున్నారు జనాలు. అదేదో పాతిక కోట్లతో తీసిన సినిమలా లేదు. వంద కోట్ల సినిమా అంటే నమ్మేస్తారు. పాతిక కోట్లతోనే ఇన్ని మంచి విజువల్స్ ఇచ్చినప్పుడు.. ప్రభాస్ తో అన్నివందల కోట్లు పెట్టి, చీప్ గ్రాఫిక్స్ తో ఎలా చుట్టేశారబ్బా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో... ఆదిపురుష్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి. హను - మాన్ కి ఎవరైతే గ్రాఫిక్స్ డిజైన్ చేశారో, వాళ్లతోనే... ఆదిపురుష్ టీమ్ పని చేయించుకొంటే.. ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయని కొంతమంది ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. మొత్తానికి.. హను - మాన్ వల్ల.. ఆదిపురుష్ మరోసారి ట్రోలింగ్ కి గురవుతోంది.