సుమంత్ అశ్విన్ - నిహారిక జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'హ్యాపీ వెడ్డింగ్'. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. లక్ష్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ, పోకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తోంది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ఓ అమ్మాయీ, అబ్బాయి ఇరు కుటుంబాల పెద్దలు. పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లి కుదిరినప్పటి నుండీ, పెళ్లి జరిగే వరకూ రెండు మనసులు, రెండు కుటుంబాల మధ్య ఎలాంటి ఎమోషన్స్ చోటు చేసుకున్నాయి వంటి రకరకాల భావనలు ఈ సినిమాలో చూపించినట్లుగా తెలుస్తోంది. మెగా డాటర్ నిహారిక, సుమంత్ అశ్విన్ ఇద్దరూ నేచురల్‌గా కనిపిస్తున్నారు. జంట చూడ చక్కగా ఉంది.
'పాలలా స్వచ్ఛమైనది మా అమ్మాయి.. కాఫీ చేసుకోవచ్చు. కాంప్లెన్ చేసుకోవచ్చు..' అని మురళీశర్మ చెప్పే డైలాగ్, 'మా మనవడితో కాపురం చేయించచ్చా..' అని అన్నపూర్ణమ్మ కౌంటర్ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచాయి. 'కేరింత' తదితర చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. తొలి సినిమా 'ఒక మనసు'తో ఆకట్టుకోలేకపోయిన మెగా డాటర్ నిహారిక తెలుగులో నటిస్తున్న రెండో చిత్రమిది. అక్కడక్కడా కాస్త గ్లామరస్‌గా అనిపించినా, అదేమంత లెక్కలోనిది కాదు.. కానీ హద్దులు మీరని గ్లామర్‌తో ఈ ట్రెండ్‌కి తగ్గ అమ్మాయిగా కనిపిస్తోంది నిహారిక.
చూడాలి మరి 'హ్యాపీ వెడ్డింగ్' ఇటు నిహారికకు, అటు సుమంత్ అశ్విన్కీ హ్యాపీ సక్సెస్ ఇస్తుందో లేదో.!