అటు సినిమా - ఇటు రాజకీయాలు అంటూ రెండు పడవల మీద కాలు వేసి ప్రయాణం చేస్తున్నాడు పవన్ కల్యాణ్. సినిమాల పరంగా పవన్ చాలా బిజీ. రాజకీయాలకూ సమయం కేటాయించాల్సివస్తోంది. దాంతో.. ఏ సినిమాకీ తగిన న్యాయం చేయలేకపోతున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ వల్ల `హరి హర వీరమల్లు` సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావల్సింది. కానీ మధ్యలో `భీమ్లా నాయక్`ని పట్టుకోవడం వల్ల లేటయిపోయింది. ఇప్పుడు `హరి హర వీరమల్లు` షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు పవన్. మరోవైపు కొత్త కథలు తయారవుతున్నాయి. త్వరలో హరీష్ శంకర్ సినిమా కూడా మొదలైపోతుందని, దానికీ కాల్షీట్లు ఇవ్వాల్సివస్తే.. అప్పుడు హరి హర వీరమల్లు మరింత లేట్ అవుతుందని వార్తలొచ్చాయి.
అయితే ఇప్పుడు పవన్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడని టాక్. క్రిష్ సినిమా పూర్తయ్యేంత వరకూ మరో సినిమా ఒప్పుకోకూడదన్నది పవన్ తాజా నిర్ణయమని సమాచారం. జూన్ వరకూ... క్రిష్ సినిమాకే కాల్షీట్లు ఇస్తాడట. ఇది పూర్తయ్యాకే కొత్త సినిమా మొదలెడతానని క్రిష్ కి చెప్పాడట. జూన్ వరకూ తన కాల్షీట్లు పూర్తిగా వాడుకోమని పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది నిజంగా క్రిష్ నెత్తిపై పాలు పోసే వార్తే. ఎందుకంటే రెండేళ్లుగా ఈ సినిమా పనిమీదే ఉన్నాడు క్రిష్. ఓ నాలుగు రోజులు షూటింగ్ చేస్తే... నెల రోజుల గ్యాప్ వచ్చేది. ఇప్పుడు ఆ బాధ లేదు. క్రిష్ కూడా ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ధ్యేయంతో ఉన్నాడు. సో... ఇప్పుడు అందుకు మార్గం సుగమం అయినట్టే.