చిన్న సినిమాకి స్టార్లు అవసరం లేదు. భారీ బడ్జెట్లూ అవసరం లేదు. కేవలం కాన్సెప్ట్ బాగుంటే చాలు. కొత్త ఐడియా ఒకటి చెబితే చాలు. అలాంటి ప్రయత్నాలు ఈమధ్య జరుగుతున్నాయి కూడా. తాజాగా `ప్లే బ్యాక్` అనే ఓ చిన్న సినిమా ట్రైలర్ చూస్తే... `వారెవా..` అనిపిస్తోంది. దానికి కారణం.. ఆ సినిమా కోసం ఎంచుకున్న కాన్సెప్టు. గతానికీ, భవిష్యత్తుకీ ముడి పెడుతూ సాగే ప్రేమ కథ ఇది. గతంలో ఉండిపోయిన అమ్మాయి.. భవిష్యత్తులోని అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడితే ఎలా ఉంటుందన్న వినూత్న ఆలోచనతో ఈ సినిమా రూపొందింది.
ఐడియా వింటూనే.. భలే అనిపిస్తోంది కదా..? దినేష్ తేజ్, అనన్య జంటగా నటించిన ఈ చిత్రానికి హరి ప్రసాద్ జక్కా దర్శకత్వం వహించారు. మార్చి 5న విడుదల అవుతోంది. ట్రైలర్ ఈమధ్యే బయటకు వచ్చింది. అందులోని పాయింట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి పాయింట్లు హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తాయి. మనవైపు నుంచి కూడా ఆతరహా ప్రయోగాలు చేయడం ఆహ్వానించదగిన పరిణామం. టీవీ 5 మూర్తి, టీఎన్నార్ లాంటి సోషల్ మీడియా స్టార్లు.. ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించడం విశేషం. మరి ఈ ప్లే బ్యాక్.. ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో తెలియాలంటే.. మార్చి 5 వరకూ ఆగాలి.