స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్నికల ప్రచారం కోసం వెళితే, 'చైతన్య రథం'ను వినియోగించేవారు. అదొక ప్రత్యేకంగా తయారు చేయబడిన వాహనం. తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లో అడ్డగోలుగా పదవులు సంపాదించేయొచ్చు అనుకునే రకం కాదు ఆ తనయుడు. ఆ చైతన్య రథానికి రథ సారధిగా తండ్రికి అంగరక్షకుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనే హరికృష్ణ.
ఎలాంటి వాహనాన్నైనా ఎంత వేగంగానైనా నడపగల సమర్ధుడు హరికృష్ణ. అలాంటి హరికృష్ణ దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హరికృష్ణ ఏంటీ.? రోడ్డు ప్రమాదంలో చనిపోవడమేంటీ.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరిలో ఒకరికి ఓ మోస్తరు గాయం కాగా, మరో వ్యక్తికి అసలేమాత్రం గాయం కాకపోవడం ఆశ్చర్యకరం.
సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హరికృష్ణ రాజకీయ తెరపైనా తనదైన ముద్ర వేశారు. దాంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలుగు వాణిని బలంగా వినిపించిన హరికృష్ణ ఇక లేరన్న వార్త జీర్ణించుకోవడం ఎవరికైనా కష్టం.!