దర్శకులు నిర్మాతలుగా మారడం కొత్తేం కాదు. సుకుమార్, క్రిష్, అనిల్ రావిపూడి, మారుతి... వీళ్లంతా అదే చేస్తున్నారు. ఓ వైపు మెగాఫోన్ పట్టి, అద్భుతాలు సృష్టిస్తూనే మరోవైపు తమ అభిరుచికి తగిన కథల్ని ఎంచుకుని, నిర్మాతలు గా మారి సినిమాలు చేస్తున్నారు. ఓటీటీలు పెరిగాక, ఈ పోకడ మరింత ఎక్కువైంది. తాజాగా హరీష్ శంకర్ కూడా.. నిర్మాతగా కొత్త అవతారం చూపించడానికి రెడీ అయ్యారు.
గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్. ఇప్పుడు పవన్ కల్యాణ్ తో మరో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కొంత టైమ్ ఉంది. ఈ గ్యాప్ లో.. ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. గీతా ఆర్ట్స్ ఇప్పుడు చిన్న సినిమాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఓటీటీల కోసం. అందులో భాగంగా గంపగుత్తగా కొన్ని సినిమాల్ని ప్రారంభించబోతోంది. ఓ చిత్రానికి హరీష్ శంకర్ సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ చిత్రానికి దశరథ్ దర్శకుడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. దీంతో పాటుగా.. తన కథతోనే హరీష్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. దీనికి కూడా... తనే నిర్మాత. త్వరలోనే ఈ ప్రాజెక్టు వివరాలు బయటకు రానున్నాయి.