కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా మారుతోంది. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా కోవిడ్ కేసులు రెట్టింపయ్యాయని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ భయాలు మళ్లీ మొదలయ్యాయి. కరోనా పేరు చెబితే.. ఇప్పుడు బాలీవుడ్ గజగజలాడుతోంది. లాక్ డౌన్ ప్రకటించకముందే... బాలీవుడ్ సర్దేసుకుంటోంది. తాజాగా అక్కడ కొత్త సినిమాలన్నీ వాయిదా బాట పడుతున్నాయి.
ఈరోజు విడుదల కావాల్సిన `హాథీ మేరీ సాథీ` (తెలుగులో అరణ్య) వాయిదా పడింది. ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా చేరింది. అదే... `బంటీ ఔర్ బబ్లీ 2`. 2005లో వచ్చిన ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమాకు సీక్వెల్‌గా ‘బంటీ ఔర్ బబ్లీ 2’ తెరకెక్కింది. వరుణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధార్థ్ చతుర్వేదీ, షార్వారీ ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదల కావాల్సింది. అయితే.. ఇప్పుడు విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
నిజానికి ఏప్రిల్ 23 కు ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఇప్పుడే.. వాయిదా వేసేశారంటే... లాక్ డౌన్ వస్తుందన్న భయంతోనే. ఇలా వరుసగా బాలీవుడ్ చిత్రాలు వాయిదా పడుతోంటే.. ఆ ప్రభావం టాలీవుడ్ కి కూడా పాకే ప్రమాదం ఉంది.