ఇప్పటి హీరోల తారక మంత్రం `పాన్ ఇండియా`. తమ సినిమా ఎలాగూ తమిళ, మలయాళ భాషల్లోకి వెళ్తోంది. హిందీలోనూ విడుదల చేసేస్తే... అదికాస్త పాన్ ఇండియా సినిమా అయిపోయి, తాము పాన్ ఇండియా హీరోలైపోవొచ్చన్నది ఆశ. తాజాగా రామ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ వైపు దృష్టి సారించాడు. త్వరలోనే రామ్ నుంచి ఓ పాన్ ఇండియా సినిమా రాబోతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిందీలో డబ్ అయి.... కనీ వినీ ఎరుగని వ్యూస్ సాధించింది.
రామ్ గత సినిమా హిందీ డబ్బింగులు కూడా ఓ రేంజ్‌లో ఆడేశాయి. అందుకే.. రామ్ కి హిందీ మార్కెట్ వైపూ దృష్టి పడినట్టుంది. నిర్మాత స్రవంతి రవికిషోర్ కూడా రామ్ తో పాన్ ఇండియా సినిమా తీస్తానని ప్రకటించేశారు. రామ్ `రెడ్` సినిమాకి ఆయనే నిర్మాత. ఈ సినిమాని 7 భాషల్లో విడుదల చేస్తున్నారు. ``రెడ్ సినిమాని ఏడు భాషల్లో విడుదల చేస్తున్నాం. 22న మలయాళంలోనూ, ఫిబ్రవరి మొదటి వారంలో హిందీలోనూ డబ్బింగ్ రూపంలో విడుదల అవుతోంది. మంచి కథ దొరికితే రామ్ తో పాన్ ఇండియా సినిమా చేస్తాం. తనకు అంత స్టామినా ఉంది`` అని చెప్పేశారు రవికిషోర్. ఇంకేం.. కథ దొరకడమే ఆలస్యం.