టాలీవుడ్ నే కాదు.. మొత్తం భారతదేశ చలన చిత్ర పరిశ్రమనీ ఆకర్షిస్తున్న సినిమా `ఆర్.ఆర్.ఆర్`. బాహుబలి తరవాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా మల్టీస్టారర్. అందుకే.. ఇంత క్రేజ్. బడ్జెట్ పరంగానూ.. `ఆర్.ఆర్.ఆర్` ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు 300 కోట్లతో రూపొందుతున్న చిత్రమిది. ఇద్దరు స్టార్ హీరోలున్నారు కాబట్టి, రాజమౌళి సినిమా కాబట్టి.. ఎంత ఖర్చు పెట్టినా, రాబట్టుకునే వీలుంది. అయితే.. ఇక్కడ ట్విస్టు ఏమిటంటే... అటు చరణ్, ఎన్టీఆర్‌లకు గానీ, ఇటు రాజమౌళికి గానీ.. ఈ సినిమాతో పారితోషికాలు ఏమీ రావడం లేదు. వాళ్లు పైగా పారితోషికం తీసుకోకుండానే ఈ సినిమా చేస్తున్నారు.
కాకపోతే... ఈ సినిమా లాభాల్లో వాళ్లకు వాటా వుంది. లాభాల్ని నాలుగువాటాలుగా విభజిస్తారని, అందులో ఓ వాటా నిర్మాతకు, మిగిలిన మూడు వాటాలూ.. చరణ్,ఎన్టీఆర్, రాజమౌళిలకు అని తెలుస్తోంది. కనీసం 300 కోట్ల లాభం ఈ సినిమా ద్వారా రావొచ్చన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఏ లెక్కన చూసుకున్నా... చరణ్, ఎన్టీఆర్‌లకు తమ కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం ఈ సినిమా నుంచే వస్తోందట. రాజమౌళి సినిమానా.. మజాకానా?