యాక్టర్ కాకుంటే ఏమయ్యేవాడివి.. డాక్టర్ అయ్యేవాడిని అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఈ మధ్య కొంత మంది యంగ్ హీరోలు డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్స్‌గా సెటిలైపోయారు. ఈ లిస్టులో నేచురల్ స్టార్ నాని, మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ సంగతి మనకు తెలుసు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చి అనూహ్యంగా హీరోలుగా దూసుకెళ్తున్నారు ఈ ఇద్దరు యంగ్ హీరోలు.
అయితే ఈ లిస్టులో మరో యంగ్ హీరో కూడా ఉన్నాడు. అదే శ్రీ విష్ణు. ఈ మధ్యనే 'మెంటల్ మదిలో' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. అస్సలు అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా విడుదలయ్యాక మంచి టాక్ తెచ్చుకుంది. వసూళ్లు కూడా బాగా రాబట్టింది. హీరోగా తనకింత సక్సెస్ తెచ్చిపెట్టిన సినిమా ఇదేనంటున్నాడు శ్రీ విష్ణు. కాగా శ్రీవిష్ణు నిజానికి హీరో అవ్వాలనుకోలేదట. డైరెక్టర్ కావాలనుకుని ఇండస్ట్రీకి వచ్చాడట. కానీ అనుకోని కారణాలతో యాక్టర్ కావాల్సి వచ్చిందంటున్నాడు.
హీరోగానే కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ శ్రీవిష్ణు అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఫ్రెండ్ క్యారెక్టర్స్‌కి మంచి వెయిట్ ఇస్తూ ఉంటాడు శ్రీవిష్ణు. 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలో రామ్‌కి ఫ్రెండ్‌గా శ్రీ విష్ణు నటన ఆకట్టుకుంటుంది. నేచురల్ యాక్టింగ్‌తో కట్టి పాడేస్తాడు. అలాగే శ్రీ విష్ణు పర్సనల్‌గా కొంచెం మొహమాటస్థుడట. ఆ ఆటిట్యూడ్ మంచిదే కానీ, కొన్ని సందర్భాల్లో ఈ ఆటిట్యూడ్ కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయినా కానీ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు.
వరుస అవకాశాలతో బిజీగానూ ఉన్నాడు. 'మెంటల్ మదిలో' తెచ్చిన ఉత్సాహం శ్రీ విష్ణుని మరిన్ని సక్సెస్‌లు అందుకునేందుకు ప్రోత్సాహం కల్గిస్తోందట. ప్రస్తుతం ఆయన చేతిలో 'నీది నాది ఒకే కథ', సినిమా, 'వీర భోగ వసంతరాయలు' సినిమాలున్నాయి. వీటిలో 'నీది నాది ఒకే కథ' సినిమా విడుదలకు సిద్ధమైంది. మరో సినిమా పట్టాలెక్కేందుకు రెడీగా ఉంది.