రాజమౌళికి బిస్కెట్టేసిన కన్నడ హీరో యష్.!

మరిన్ని వార్తలు

కన్నడ హీరో యష్‌ పేరు ఈ మధ్య టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. దానికి కారణం ఆయన నటించిన 'కేజీఎఫ్‌' చిత్రం తెలుగులోనూ విడుదలవుతుండడమే. వారాహి బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగులో విడుదలైన ఈ సినిమాకి ట్రైలర్‌ మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇక సినిమా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని హైద్రాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కి రాజమౌళి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాజమౌళిని ఆయన డైరెక్షన్‌ గొప్పతనాన్ని, చిన్న సినిమాల్ని, ఇతర భాషా సినిమాల విషయంలో ఆయన మెచ్చుకునే తీరు గురించి హీరో యష్‌ తెగ పొగిడేశాడు. ఏకంగా రాజమౌళిపై ఓ కథనే అల్లేశాడీ యంగ్‌ హీరో. రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఆయన్ని ఆకాశానికెత్తేశాడు. ఇంకేముంది 'కేజీఎఫ్‌'కి రావల్సిన క్రేజ్‌ వచ్చేసిందంతే. సినిమాని విజన్‌తో తెరకెక్కించడమే కాదు, దాన్ని ఎలా ప్రమోట్‌ చేయాలో కూడా బాగా తెలిసిన డైరెక్టర్‌ రాజమౌళి.

వారాహి బ్యానర్‌లో గతంలో చాలా అనువాద చిత్రాలూ, చిన్న చిత్రాలూ విడుదలయ్యాయి. మంచి విజయం అందుకున్నాయి. అలాగే ఆ బ్యానర్‌లో విడుదలవుతోన్న 'కేజీఎఫ్‌' కూడా మంచి విజయం దక్కించుకోనుందని అంచనా వేస్తున్నారు. కంటెన్ట్‌ పరంగా కూడా ఈ సినిమా స్ట్రాంగ్‌గా ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా పరిచయమవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS