పవన్ కల్యాణ్ వరుసగా రెండు సినిమాలకు పచ్చజెండా ఊపాడు. సుజిత్ తో ఓ సినిమా ఒప్పుకొన్నాడు. హరీష్ శంకర్ సినిమానీ పట్టాలెక్కించాడు. హరి హర వీరమల్లు ముగిసిన వెంటనే ఈ రెండు చిత్రాలూ సమాంతరంగా మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలకూ హీరోయిన్ల కోసం అన్వేషిస్తున్నారు. పవన్ కల్యాణ్ - హరీష్ కాంబోలో రూపొందుతున్న `ఉస్తాద్ భగత్ సింగ్`కి ముందు.. పూజా హెగ్డేని కథానాయికగా అనుకొన్నారు. కానీ ఈ సినిమా ఆలస్యమవ్వడంతో.. పూజా కాల్షీట్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇప్పుడు పూజా హెగ్డే స్థానంలో మరో కథానాయిక ని తీసుకోవాల్సివస్తోంది.
సుజిత్ దర్శకత్వంలో పవన్ నటించే సినిమాకి సంబంధించి ఇటీవలే ఓ అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుజిత్ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈసినిమాలో కథానాయికని ఎంపిక చేయాల్సివుంది. పవన్ కోసం ఈసారి బాలీవుడ్ భామని దిగుమతి చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాల్లో హీరోయిన్‌గా ఎవరెవరికి ఛాన్స్ వస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాలి.