సినిమా అనేది... స్టార్ హీరోల చుట్టూనే తిరుగుతుంది. వాళ్లే.. చిత్రసీమకు మూలస్థంభాలు. అందుకే హీరోలు ఏం చెబితే అది చేయాల్సివస్తోంది. వాళ్ల డిమాండ్లని భరించాల్సివస్తోంది. హీరోలతోనే వేగలేక చస్తుంటే.. ఇప్పుడు హీరోయిన్లు కూడా తయారైపోయారు. వాళ్ల షాకుల్నీ, డిమాండ్లనీ తట్టుకోలేక నిర్మాతలు మొహాలు వేలాడదీసేస్తున్నారు. ఆఖరికి కొంతమంది హీరోయిన్ల పేరు చెబితేనే నిర్మాతలు, దర్శకులు భయపడిపోతున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఎప్పటి నుంచో ఉంది. ఉన్న కొద్దిమందినే రిపీట్ చేయాల్సివస్తోంది. డిమాండ్‌ని బట్టే పారితోషికం కదా? అందుకే చేతిలో హిట్లు లేకపోయినా.. కథానాయికలు వీర లెవిల్లో పారితోషికాల్ని డిమాండ్ చేస్తున్నారు. గత్యంతరం లేక వాళ్లు అడిగిందంతా ఇస్తూపోతున్నారు.
అయితే ఇంత పారితోషికం ఇచ్చినా... ప్రమోషన్లకు రమ్మంటే రారు. వచ్చినా... నాకు సెవెన్ స్టార్ హోటల్లో వసతి కావాలనో, కార్ వాన్లు కావాలనో, మేకప్ కిట్లు తక్కువయ్యాయనో గోల పెడుతున్నారు. కథానాయికతో పాటు వాళ్ల అమ్మానాన్న, వ్యక్తిగత సిబ్బందిని కూడా పోషించడంతో నిర్మాతలకు తడిసి మోపెడవుతుంది. సినిమా ప్రమోషన్ల కంటే.. షాపింగ్ మాల్స్ ఓపెనింగులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు హీరోయిన్లు. ఓ గంట షాపింగ్ మాల్‌లో హడావుడి చేస్తే చాలు.. లక్షలు లక్షలు వచ్చిపడిపోతుంటాయి. అందుకే.. సినిమాలు, షూటింగులు, ప్రమోషన్లు పక్కన పెట్టి అక్కడ వాలిపోతున్నారు. ఓ మాట గట్టిగా మాట్లాడాలన్న నిర్మాతలకు భయమే.
'మీటూ', 'క్యాస్ట్ కౌచింగ్'ల పేర్లతో ఎక్కడ తమ పేర్లని ఇరికిస్తారేమోనని భయపడుతుంటారు. ముందస్తు ఎగ్రిమెంట్లలో ప్రచారానికి వచ్చి తీరాలి అనే షరతులేం లేకుండా, వీలుని బట్టి వస్తాం అనే క్లాజు జోడిస్తున్నారు. దాంతో నిర్మాతలు కూడా గట్టిగా మాట్లాడే అవకాశాలు లేకుండా పోతున్నాయి. సౌత్ వదిలి బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకుందామంటే.. వాళ్లు మరింత ఎక్కువ టార్చర్ పెడుతుంటారు. వాళ్ల పారితోషికాలు ఎక్కువ. దాంతో పాటు కోరికలూ ఎక్కువే. వాళ్లకు నచ్చిన హోటెల్ నుంచే భోజనాలు తీసుకురావాలి. కాఫీ కూడా భరిస్తా, స్టార్ బగ్స్‌లాంటి చోట నుంచే రప్పించాలి. ఈ ఖర్చు భరించడం కంటే.. సౌత్ ఇండియన్ హీరోయిన్లని భరించడమే తేలిక అనుకుంటున్నారు నిర్మాతలు.