మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా విషయమై మళ్ళీ టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కరోనా నేపథ్యంలో ఈక్వేషన్స్ మారిపోయాయి. అయినాగానీ, తెలుగు సినిమా మళ్ళీ ట్రాక్ ఎక్కేసింది. 50 శాతం ఆక్యుపెన్సీతోనే సంక్రాంతి సినిమాలు మంచి వసూళ్ళను రాబట్టాయి. అలాంటిది, ఆక్యుపెన్సీ పెరిగాక.. వ్యాక్సిన్ కూడా అందుబాటులో వచ్చేశాక, వసూళ్ళ ఫండగ ఇంకెలా వుంటుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
టాలీవుడ్ ట్రేడ్ పండితులైతే పూర్తి నమ్మకంతో వున్నారు.. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమ పుంజుకుంటుందని. పెద్ద సినిమాల రిలీజ్‌లు లైన్‌లో వున్నాయి. ఎడా పెడా ప్రకటనలు వచ్చేశాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఈ యేడాది విడుదల కానున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి కాగా, ‘రాధేశ్యామ్’ కూడా ఆ స్థాయిలోనే అంచనాలతో వుంది. వీటికి ఏమాత్రం తీసిపోకుండా ‘వకీల్ సాబ్’, ‘ఆచార్య’ సినిమాలు రెడీ అవుతున్నాయి.
వీటిల్లో మళ్ళీ ‘ఆచార్య’ గురించిన చర్చ విపరీతంగా జరుగుతోంది తెలుగు సినీ వర్గాల్లో. కొత్తగా మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ స్టామినాని నిరూపించుకోవాల్సిన పనిలేదు. అయినాగానీ, ‘ఆచార్య’ సినిమా ఎంత వసూలు చేస్తుంది.? అనే దాని చుట్టూ చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 100 కోట్లు దాటేయడం చిరంజీవికి చాలా చిన్న విషయం. మరి, ‘ఆచార్య’ 200 కోట్లు కొల్లగొట్టే సినిమా అవుతుందా.? అనేదే ప్రశ్న. ‘ఆచార్య’ టీజర్ వచ్చాక, అది పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు చాలామంది. దటీజ్ మెగాస్టార్.