అనేక వాయిదాలు పడిన తరవాత... ఎట్టకేలకు `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` విడుదలైంది. తొలి రోజు డివైడ్ టాక్ అందుకున్నా - ఓ మాదిరి వసూళ్లతో ఓకే అనిపించుకుంది. తొలి మూడు రోజుల్లో దాదాపు 20 కోట్లు సంపాదించింది. ఫైనల్ రన్ లో రూ.25 కోట్లకు చేరుకోవచ్చు. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి మరో 10 కోట్లు అనుకుంటే.. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ 30 కోట్లు అన్నమాట.
అయితే ఈ ఫిగర్ ఇప్పుడు `ఏజెంట్`పై ఎఫెక్ట్ చూపిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఏజెంట్. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈసినిమాకి దాదాపు 50 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారు. అఖిల్ పై ఇది రిస్కే. ఎందుకంటే...అఖిల్ ఖాతాలో ఇప్పటి వరకూ హిట్స్ లేవు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా హిట్ కాదు. యావరేజ్‌మార్క్ దగ్గర ఆడింది. దసరా సీజన్ కాబట్టి, ఈ సినిమాకి కనీసం ఇన్ని వసూళ్లు వచ్చాయి.కాకపోతే.. పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఏజెంట్ కి 50 కోట్లు పెడితే, కనీసం 60 కోట్లు వెనక్కి రావాలి. అంటే.. బ్యాచిలర్ కంటే రెండు రెట్లు ఎక్కువ సంపాదించాలన్నమాట. అది దాదాపు అసాధ్యం. ఏజెంట్ కి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప... 60 కోట్లు రాబట్టలేరు. అందుకే ఏజెంట్ బడ్జెట్ పై బ్యాచిలర్ ప్రభావం పడినట్టైంది. అర్జెంటుగా.. ఈ సినిమా బడ్జెట్ లో కోత విధించాలని నిర్మాతలు భావిస్తున్నార్ట. కనీసం ఈసినిమా బడ్జెట్ లో పది కోట్లయినా... తగ్గించాలని నిర్మాత అనిల్ సుంకర ఆలోచిస్తున్నార్ట. అంటే.. ఈ సినిమాని 40 కోట్లలో పూర్తి చేయాలన్నమాట.