ఇటీవలే మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' షూటింగ్ ముగించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన 168వ సినిమాను సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి నుండి దర్శకుడు శివ పట్ల ఆసక్తి చూపుతూ వచ్చిన రజనీ రెండుసార్లు కథా చర్చలు కూడా జరిపారు. చివరికి ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నారట. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు వీరి సినిమా డిసెంబర్ మొదటి వారంలో పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది.
రజనీ అభిమానులు, సినీ ప్రేక్షకులు వీరి కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే హీరోలను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివది ప్రత్యేక శైలి. మాస్, క్లాస్ రెండు వర్గాల చేత విజిల్ వేయించగలిగే ట్రీట్మెంట్ ఇవ్వగలడు. 'వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం' లాంటి సినిమాలే అందుకు ఉదాహరణ. కాబట్టే రజనీని శివ ఏ స్థాయిలో చూపుతాడోనని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి. ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేసే శివ.. మరి రజినితో కూడా యాక్షనే ప్లాన్ చేశాడా.. లేక కొత్తధనం కోసం కొత్తగా ఏమైనా ట్రై చేశాడా అనేది చూడాలి. కథ అయితే సూపర్ స్టార్ కి అద్భుతంగా సెట్ అవుతుందని.. అందుకే రజిని సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాడట. మరి రజిని నమ్మకాన్ని శివ నిలబెట్టుకుంటాడా అనేది బాక్సాఫీసే చెప్పాలి.