మెగా మేనల్లుడు 'సాయి ధరమ్ తేజ్' ఇండస్ట్రీలోకి 'పిల్లా.. నువ్వులేని జీవితం' అనే మంచి హిట్ మూవీతోనే గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినా.. 'చిత్రలహరి'కి ముందు బాక్సాఫీస్ వద్ద దాదాపు ఆరు ప్లాప్ లతో కొట్టుమిట్టాడాడు. ఎప్పుడో 2015లో వచ్చిన ‘సుప్రీమ్’ తర్వాత చేసిన 'తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు' ఇలా తేజు నటించిన చిత్రాలన్నీ భారీ డిజాస్టర్లే.
ఈ డిజాస్టర్ల దెబ్బకి సాయి తేజు మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. అందుకే 'నేను శైలజ' ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన 'చిత్రలహరి'కి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్ లో రాబట్టలేకపోయింది. మొత్తానికి హిట్ వచ్చినా.. మెగా మేనల్లుడు డీలా పడాల్సిన పరిస్ధితి. దాంతో ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మారుతితో చేస్తోన్న "ప్రతిరోజూ పండగే" పై కూడా ఆ ప్లాప్ ల ప్రభావం బాగానే పడింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మార్కెట్ ఆశించిన స్థాయిలో జరగట్లేదు. లెక్క ప్రకారం ఈ సినిమాకి బయ్యర్స్ నుంచి మంచి డిమాండ్ ఉండాలి, కానీ బయ్యర్లు ఈ సినిమా కోసం నిర్మాతలు అడిగినంత ఇవ్వడానికి ముందుకు రావట్లేదట. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరువుకుంటున్న ఈ సినిమా నుండి చిత్రబృందం వదులుతోన్న సాంగ్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ "సుప్రీం" సినిమాలో కలిసి నటించడం జరిగింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఏదేమైనా ఈ చిత్రం ఫలితం బట్టే బాక్సాఫీస్ వద్ద 'సాయి ధరమ్ తేజ్' రేంజ్ అలాగే మార్కెట్ ఆధారపడి ఉంటుంది.