టచ్ చేసి చూడు, నేల టికెట్టు, అమర్ అబ్బర్ ఆంటోనీ, డిస్కో రాజా... ఇలా.. ఒకదాని వెంట మరో ఫ్లాపు చుట్టుముట్టింది రవితేజని. ఎవరికైనా ఓ ఫ్లాపు తగిలిలే.. అల్ల కల్లోలం అయిపోతుంది. అయితే వరుసగా నాలుగు పరాజయాలు వచ్చినా రవితేజ కెరీర్ కి ఢోకా లేకుండా పోయింది. అవకాశాలు వస్తూనే ఉన్నాయి. రవితేజ పారితోషికం పెంచుతూనే ఉన్నాడు. అయితే... రవితేజకు ఓ హిట్టు కొట్టడం అత్యవసరం. తాను బరిలోనే ఉన్నానని, తన పని అయిపోలేదని చెప్పుకోవాలంటే... హిట్టు కంపల్సరీ. నిర్మాతలు, బయ్యర్లూ భరోసాగా ఉండాలన్నా, చేతిలో ఉన్న సినిమాలు పక్కాగా పట్టాలెక్కాలన్నా... బాక్సాఫీసు దగ్గర వసూళ్లు కురిపించగలిగే సినిమా ఒకటి ఇవ్వాలి. ఆ బాధ్యత ఇప్పుడ క్రాక్ పై ఉంది.
ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాల్లో `క్రాక్` ఒకటి. జనవరి 9నే ఈ సినిమా వస్తోంది. సంక్రాంతి తొలి కోడి పుంజు రవితేజదే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. శ్రుతిహాసన్ నాయిక. ఇటీవల విడుదలైన ట్రైలర్ దద్దరిల్లిపోయింది. ఈ సంక్రాంతికి ఫుల్ మాస్ మీల్స్ పెట్టే సినిమా ఇదే అన్న నమ్మకం కలిగింది. రూ.14 కోట్లు రాబడితే చాలు. బయ్యర్లు సేఫ్ అయిపోతారు. సంక్రాంతి సీజన్ కాబట్టి... 14 కోట్లు తెచ్చుకోవడం ఈజీనే. కాకపోతే.. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర నిలబడుతుందా, లేదా? నిలబడితే ఎంత వసూలు చేస్తుంది? అనేదే పెద్ద ప్రశ్న. రవితేజ స్టామినా తగ్గలేదు.. అని నిరూపించాలంటే ఈసినిమా కనీసం 20 కోట్లయినా రాబట్టాలి. రవితేజ వరుస ఫ్లాపుల నేపథ్యంలో 20 కోట్ల వసూళ్లు.. అంత ఈజీ విషయం కాదు. పైగా కాస్త నెగిటీవ్ టాక్ వచ్చినా... తొలి రోజే బోర్లా పడిపోతుంది. మరి.. రవితేజ భవిష్యత్తు ఎలా ఉంటుందో.. క్రాక్ ఏం చేస్తుందో?