ఓ సినిమా హిట్టయిందంటే.. సీక్వెల్ బీజం పడిపోతుంటుంది. క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లకు ఆ వెసులు బాటు మరింత ఎక్కువగా ఉంటుంది. విశ్వక్ సేన్ కథానాయకుడిగా, శైలేష్ కొలను దర్శకత్వంలో, నాని నిర్మాతగా రూపొందిన `హిట్` మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా రెడీ అయ్యింది. ఈసారి.. అడవిశేష్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. డిసెంబరు 2న విడుదల కానుంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
ఇదో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ట్రైలర్‌లో థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. వైజాగ్ లో ఓ హత్య జరుగుతుంది. సంజన అనే అమ్మాయిని దారుణంగా చంపేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ బాధ్యత కేడీ అనే పోలీస్ అధికారి చేతికి వస్తుంది. క్రిమినల్ ని చాలా తక్కువగా అంచనా వేస్తుంటాడు కేడీ. అందుకే `సాధారణంగా ఈ క్రిమినల్స్ కి తెలివి తక్కువ. కోడి బుర్ర. వాళ్లని 5 నిమిషాల్లో పట్టుకోవొచ్చు` అంటూ క్రిమినల్ ని తక్కువ చేసి మాట్లాడతాడు. దాంతో.. ఆ హంతకుడికి మరింత కసి పెరుగుతుంది.
ఆ క్రమంలో ఇంకొన్ని హత్యలు చేస్తాడు. మరి కోడి బుర్రున్న ఆ క్రిమినల్ ఎవరు? వాడ్ని పోలీసులు పట్టుకొన్నారా, లేదా? అనేది తెరపై చూడాలి. హిట్ లానే.. హిట్ 2 కూడా ఓ కేసు చుట్టూ సాగే డ్రామా. అందులోని మలుపులు ఆకట్టుకొనేలా ఉన్నాయన్న సంగతి.. ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ఎమోషన్స్ అన్నీ చక్కగా కుదిరాయి. మరి.. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.