మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చాక చేస్తున్న మెగా ప్రాజెక్ట్- సైరా. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్ర కోసం వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.
ఇక ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకి చాలా ప్రాముఖ్యత ఉన్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది. దీనికోసమే పోరాట సన్నివేశాలని చిత్రీకరించేందుకు హాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాలు అయిన స్కైఫాల్, ఫాస్ట్ & ఫ్యురియస్ వంటి వాటికి యాక్షన్ డైరెక్టర్ గా పనిచేసిన గ్రెగ్ పావెల్ ఈ చిత్రానికి పనిచేయడానికి ముందుకొచ్చాడు. ఇక ఈ మధ్యనే ఆయన హైదరాబాద్ కి వచ్చి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటునాడట.
దీనికి సంబంధించి చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి సోషల్ మీడియాలో గ్రెగ్ పావెల్ తో కలిసి దిగిన ఫోటో ఒకటి పెట్టాడు. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణంలో రామ్ చరణ్ & కో ఎక్కడా కూడా ఖర్చు కి వెనకాడకుండా సైరాని నిర్మిస్తున్నారు. తాజాగా గ్రెగ్ పావెల్ ని ఈ సినిమా చేయడానికి పిలిపించడమే ఇందుకు మంచి ఉదాహరణ.
హాలీవుడ్ స్థాయి పోరాట సన్నివేశాలతో ఈ చిత్రం విడుదల తరువాత మెగా అభిమానులకి ఒక తీపి గుర్తుగా నిలిచిపోతుంది అనే నమ్మకం ఉంది.