అదేదో సినిమాలో చెప్పినట్లు కాదు. నిజంగానే హైద్రాబాద్‌కి సముద్రం వచ్చింది. సునామీతో ముంచెత్తింది. ఈ సముద్రం జల సముద్రం కాదు. జన సముద్రం. మెగా జన సునామీ. మెగాస్టార్ నటిస్తున్న 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి' సినిమా విడుదల సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడకు అభిమానులు జన సంద్రాన్ని తలపించేలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా సినిమాకి మాటలు అందించిన మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ 'హైద్రాబాద్‌కి సముద్రం వచ్చింది' అని అక్కడికి విచ్చేసిన అభిమాన గణాన్ని ఉద్దేశించి అభివర్ణించారు.
జక్కన్న రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడుతూ, 'భారత దేశం గొప్పతనం తెలియజేసే చిత్రమిది.. మరుగున పడిపోయిన ఓ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత గాధని ప్రపంచానికి చాటి చెప్పే చిత్రం.. ఉయ్యాలవాడ వంటి కొందరు వ్యక్తుల సమూహం, వారి జీవితాల త్యాగ ఫలమే ఈ భారతదేశం. ఇంత గొప్ప కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నా గొంతు ఇవ్వడం ద్వారా నేనూ ఓ భాగమైనందుకు ఎంతో గర్వపడుతున్నా.
నా దేశం కోసం, నా ప్రజల కోసం తీసిన సినిమా ఇది అని ప్రసంగించారు. అన్నయ్య డ్రీమ్ నెరవేర్చడంలో నేను చేయలేకపోయిన పని నా కంటే చిన్నోడైన రామ్‌చరణ్ చేసినందుకు చరణ్‌ని అభినందిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న 'సైరా' ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.