భారీదనం అనే పదానికి కేరాఫ్ అడ్రస్స్.. శంకర్. ఆయన సినిమాలోని ప్రతీ సీనూ కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ప్రతీ ఫ్రేమునీ ప్రేమగా చెక్కుతుంటారాయన. అందుకే ఆయన సినిమాలన్నీ బడ్జెట్ అంకెల్ని, లెక్కల్నీ దాటేస్తుంటాయి. ముఖ్యంగా పాటలు తెరకెక్కించడంలో శంకర్ శైలి ప్రత్యేకం. ప్రతీ సినిమాలోనూ.. పాటల్లో తనదైన మార్క్ చూపిస్తుంటారు. ప్రేమికుడులో.. అద్దాల బస్సుని చూపించడం గానీ, జీన్స్ లో ఏడు వింతల్ని ఆవిష్కరించడం గానీ - శంకర్ శైలికి అద్దం పడుతుంది.
ఇప్పుడు రామ్ చరణ్ సినిమా కోసం కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా ,రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కైరా అద్వాణీ కథానాయిక. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా కోసం పూణెలో ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. ఈ పాట కోసం ఏకంగా 12 రోజులు కేటాయించార్ట. సాధారణంగా ఓ పాటని రెండు లేదా మూడు రోజుల్లో పూర్తి చేస్తారు. మహా అయితే నాలుగు రోజులు తీసుకుంటారు. శంకర్ మాత్రం 12 రోజులు తీసుకుంటున్నాడు. రోజుకి కోటి చెప్పున ఈ పాట కోసం 12 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. 12 కోట్లకి సినిమా పూర్తి చేస్తున్న రోజులివి. అలాంటిది పాటకే 12 కోట్లంటే - ఇక వేరే చెప్పేదేముంది? అయితే ఈ పాటలో మాత్రం చాలా వింతలూ విశేషాలూ ఉంటాయట. అందుకే అంత ఖర్చవుతోందట. పాటకే 12 కోట్లంటే.. ఇక సినిమా మొత్తం పూర్తయ్యేసరికి ఎంత అవుతుందో?