2022 సంక్రాంతి సీజన్ పై చాలా ఆశలు పెట్టుకుంది టాలీవుడ్. ఎందుకంటే.. టాలీవుడ్ కి సంక్రాంతికి మించిన సీజన్ లేదు. కొత్త యేడాది కేలండర్ సంక్రాంతి సినిమాలతోనే మొదలవుతుంది. పండగ రోజులు కాబట్టి - వీలైనన్ని ఎక్కువ సినిమాలు దించడానికి ప్రయత్నిస్తుంటుంది టాలీవుడ్. ఈసారీ.. అదే జరగబోతుందని ఆశ పడ్డారు. భీమ్లా నాయక్, సర్కారువారి పాట, రాధేశ్యామ్, ఎఫ్ 3 చిత్రాలు సంక్రాంతికి వస్తున్నామని ముందే చెప్పేశాయి. `బంగార్రాజు` కూడా బరిలో ఉంటాడని అంతా ఆశించారు. ఆ తరవాత.. `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ డేట్ వచ్చింది. రాజమౌళి రాకతో.. ఇప్పుడు సంక్రాంతి బరిలో మిగిలిన సినిమాలు తప్పుకోవడం మొదలెట్టాయి.
ఎఫ్ 3 సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నామంటూ నిర్మాత దిల్ రాజు ప్రకటించేశారు. బంగార్రాజు ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు భీమ్లా నాయక్, సర్కారు వారి పాట కూడా ఈ పోటీ నుంచి తప్పుకున్ననట్టు సమాచారం అందుతోంది. భీమ్లానాయక్ ని ఉగాదికి, సర్కారు వారి పాటని వేసవికి విడుదల చేయాలని భావిస్తున్నార్ట. అంటే.. ఈ సంక్రాంతికి అసలు సిసలైన పోటీ ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ల మధ్యే అన్నమాట. రెండు సినిమాల మధ్య వారం రోజుల గ్యాప్ ఉంది. కాబట్టి... దాదాపుగా సోలో రిలీజ్ గానే లెక్క. రెండూ పాన్ ఇండియా సినిమాలే. మరి ఈ రెండు సినిమాల్లో ఎవరిది పై చేయే తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.