ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఊహించుకోవాల్సిందే. ఎందుకంటే... తన స్టార్ డమ్ అలా ఉంది. కనీసం 300 కోట్లు లేకపోతే.. ప్రభాస్ సినిమా అవ్వదు. తన చేతిలో మూడు సినిమాలంటే.. ఆ మూడింటి బడ్జెట్ ఏకంగా 1000 కోట్లుంది. దాన్ని బట్టి ప్రభాస్ స్టామినా ఏమిటో అర్థం చేసుకోవొచ్చు. ప్రభాస్ చేస్తున్న `ఆదిపురుష్`పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మైథలాజికల్ సినిమా కాబట్టి.. ఓ కొత్త ప్రభాస్ ని చూడబోతున్నామన్న ఆశ కలుగుతోంది.
అయితే.. ఈ సినిమాపై అంచనాల్ని కావాలనే చిత్రబృందం తగ్గించే ప్రయత్నాలు చేస్తోందేమో అనిపిస్తోంది.కథానాయిక ఎంపికలో చిత్రబృందం చేస్తున్న ప్రయత్నాలే అందుకు ఉదాహరణ. ఈ సినిమా కోసం కచ్చితంగా ఓ స్టార్ హీరోయిన్ నే ఎంపిక చేస్తారనుకున్నారంతా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల పేర్లు చాలా వార్తల్లో వినిపించాయి. అనుష్క, కీర్తి సురేష్.. ఇలా సౌత్ ఇండియన్ హీరోయిన్ల పేర్లూ చర్చించారు.చివరికి కృతి సనన్ ని తీసుకున్నారు. సీత పాత్రకు కృతి సనన్ సెట్టవుతుందా? లేదా? అనేది పక్కన పెడితే, అసలు ప్రభాస్ ఇమేజ్‌కే కృతి సెట్ కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రభాస్ తో జోడీ కట్టిన వాళ్లంతా స్టార్ హీరోయిన్లే. కృతి మాత్రం ఫ్లాప్ హీరోయిన్. తాను చేసిన సినిమాలన్నీ ఫ్లాపవుతున్నాయి. తెలుగులో కృతి సనన్ పేరుని పలకరించడానికే ధైర్యం చేయడం లేదు. ఇలాంటి రోజుల్లో.. ప్రభాస్ పక్కన, పైగా సీత పాత్రలో కృతిని తీసుకోవడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
ఇదంతా.. చిత్రబృందం కావాలని వేసిన ఎత్తుగడ అనిపిస్తోంది. ప్రభాస్ సినిమా అనగానే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. స్టార్ కాస్ట్ కూడా బలంగా ఉంటే..ఆ అంచనాలు మరింత ఎక్కువ అవుతాయి. అందుకే. ఈ ప్రయత్నం చేస్తున్నారేమో అని ప్రభాస్ ఫ్యాన్స్ సంతృప్తి పడుతున్నారు. నిజమేంటో.. చిత్రబృందానికే ఎరుక.