మహేష్ బాబు హీరోగా మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్పైడర్. దసరా కానుకగా వస్తున్న ఈ సినిమా ఫ్రీ - రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో చాలా గ్రాండ్ గా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇక ఈ ఫంక్షన్ లో మహేష్ బాబు మాట్లాడుతూ, నాకు సినిమా నచ్చి కమిటైతే ప్రాణం పెట్టి నటిస్తా.. నాకు నా దర్శకులు దేవుళ్ళతో సమానం. ఇది నేను నమ్మాను కాబట్టే నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారు. మీ లాంటి అభిమానులు ఏ హీరోకు ఉండరు. మీరు నా సినిమా నచ్చితేనే చూస్తారు, లేకపోతే చూడరు. ఈరోజు కోసం ఏడాదిన్నరగా ఎదురు చూశాం. 10 ఏళ్ళ క్రితం పోకిరి సమయంలో నేను మురుగుదాస్ ని కలిసాను. ఆయనతో కలిసి పనిచేయటం నా అదృష్టం. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పినప్పుడు నేనే స్టన్ అయిపోయా. ఒక సినిమాను రెండు సార్లు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్స్ కి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. నేను 10 ఏళ్ళ క్రితం మురుగుదాస్ గారిని ఎలా చూసానో ఇప్పటికీ ఆయన అలానే ఉన్నారు.
స్పైడర్ లాంటి చిత్రం తీయాలంటే ఒక ఫ్యాషన్ ఉండాలని, అది మా నిర్మాతలకు ఉంది కాబట్టే ఇది సాధ్యం అయిందని నిర్మాతలను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక కెమెరామెన్ సంతోష్ శివన్ గురించి మాట్లాడుతూ చిన్నప్పటి నుండి ఆయనతో కలిసి చేయాలన్న కోరిక ఈ సినిమాతో నెరవేరిందని అన్నారు. ఇక ఫైట్ మాస్టర్ 'పీటర్ హెయిన్స్' ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసాడని మహేష్ అన్నాడు.