ఐకాన్.. ఈ టైటిల్ ఏళ్లకు ఏళ్లుగా నలుగుతూనే ఉంది. ఈ కథ పట్టుకుని బన్నీ చుట్టూ తిరిగాడు వేణు శ్రీరామ్. అప్పట్లో చేస్తా.. చేస్తా.. అని బన్నీ హ్యాండ్ ఇచ్చాడు. దాంతో కొంత కాలం ఈ కథని వేణు శ్రీరామ్ పక్కన పెట్టేశాడు. కానీ ఇప్పుడు ఐకాన్ కి టైమ్ వచ్చింది. ఈ సినిమాకి బన్నీ మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈసారి ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఫిక్సయ్యారు. అంతలోనే ఇంత మార్పు ఎలా?
ఎలాగంటే... ఈ ఐకాన్ స్క్రిప్టులో చాలా మార్పులు జరిగాయట. ఇది వరకు ఈ సినిమాని కేవలం ప్రయోగాత్మక చిత్రంగా మలచాలని అనుకున్నార్ట. ఎలాంటి కమర్షియల్ హంగులూ లేకుండా, తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాని తీద్దాం అనుకున్నార్ట. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకే కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు. హీరోయిన్లని తెచ్చి పెట్టారు. బాలీవుడ్ స్టార్లూ.. ఫైట్లూ, హంగామా ఇదంతా చేరింది. దాంతో.. బన్నీకి కూడా నచ్చేసిందట. అందుకే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతోంది. మరి ఈ మార్పులు ఐకాన్ ని ముంచుతాయా? తేల్చుతాయా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. పుష్ష1 పార్ట్ పూర్తయిన వెంటనే.. ఈ సినిమాని పట్టాలెక్కిస్తారు. పుష్ష 1కీ, పుష్ష 2కీ మధ్య రిలీజ్ అయ్యే బన్నీ సినిమా ఇదే.