కొంతమంది దిగ్గజాలు.. అప్పుడప్పుడూ చిన్న చిన్న విషయాలకు అతిగా స్పందిస్తూ - ఆశ్చర్యపరుస్తుంటారు. మొన్నటికి మొన్న బిగ్ బీ. ట్విట్టర్‌లో ఎవరో పెట్టిన ఓ కామెంట్ కు అతిగా స్పందించి - వార్తలకెక్కారు. ఇప్పుడు ఇళయరాజా వంతు వచ్చింది.
చెన్నైలోని ప్రసాద్ స్టూడియోస్‌లో ఇళయరాజాకు శాశ్వత అతిథ్యం ఉంది. అక్కడి రికార్డింగ్ థియేటర్లోనే ఇళయరాజా గత నలభై ఏళ్లుగా పాటలు కంపోజ్ చేస్తున్నారు. అప్పట్లో ఎల్.వీ ప్రసాద్.. ఇళయ రాజాపై అభిమానంతో ఆ స్టూడియోని ఆయనకు కేటాయించారు. `మీరెప్పుడైనా ఇందులోనే పాటలు కంపోజ్ చేసుకోవాలి` అంటూ.. అభిమానంతో - ఇళయరాజాకు కేటాయించారు. ఇళయరాజా కూడా గత నలభై ఏళ్లుగా అక్కడే పాటల్ని కంపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు తరాలు మారాయి. ఎల్.వి. ప్రసాద్ సాయి ప్రసాద్ ప్రస్తుతం ఆ స్టూడియో బాధ్యతలు చూసుకుంటున్నారు. తన స్టూడియోని ఖాళీ చేయాల్సిందిగా ఇళయరాజాకు ఆయన ఇది వరకే నోటీసులు జారీ చేశారు. కానీ ఇళయరాజా మాత్రం మొండిగా.. `స్టూడియోపై నాకు అధికారాలు ఉన్నాయి` అంటూ కోర్టుకు వెళ్లారు. కోర్టులో ఈ గొడవ జరుగుతోంది. అయితే.. ఇప్పుడు మళ్లీ ఇళయరాజా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. స్టూడియోలోంచి తనని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్టూడియో.. ఎల్వీ ప్రసాద్ వారసులది. ఇళయరాజాకి స్టూడియోలో కొంతభాగం రాసిచ్చిన పత్రాలు లేవు. అప్పట్లో గౌరవంగా ఆయనకు రికార్డింగ్ థియేటర్ లో పని చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దాన్ని ఇళయరాజా హక్కుగా తీసుకొంటే ఎలా? అన్నది ఎన్వీ ప్రసాద్ వారసుల వాదన. అది నిజం కూడా. కానీ ఇళయరాజా మాత్రం కాస్త మొండితనం ప్రదర్శిస్తూ స్టూడియోని ఖాళీ చేసేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. ఇంతటి మొండితనం ఇళయరాజాలాంటి వ్యక్తులకు తగదని, ఈ విషయంలో ఆయన హుందాగా ఉండాల్సిందని.. చెన్నై వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి కోర్టు ఏమంటుందో?