సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యలో ఎన్ని మలుపులో. ఇంకెన్ని కొత్త కథలో. ఇది ఆత్మహత్యే అని పోలీసులు నిర్దారణ చేసినా, పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో అదే ఉన్నా - ఆత్మహత్యకు ప్రేరేపించిన విషయాలు చాలానే ఉన్నాయన్నది అభిమానుల వాదన. దానికి ఎప్పటికప్పుడు బలం చేకూరుతూనే ఉంది. తాజాగా ఈ ఆత్మహత్యలో రియా చక్రవర్తి ప్రమేయం ఉందనడానికి రుజువులు ఎక్కువవుతున్నాయి.
జూన్ 14న ముంబైలోని తన ఫ్లాట్ లో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తండ్రి కె.కె. సింగ్ సుశాంత్ మాజీ రియా చక్రవర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొత్త మలుపు తిరిగింది. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రియా ఖాతాలోకి 15 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని, డబ్బు బదిలీ అయిన వారం రోజులకు తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని కె.కె.సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ విషయంలో ముందు నుంచీ మౌనంగా ఉన్న రియా ఎట్టకేలకు స్పందించింది. ఏడాది కాలంగా సుశాంత్‌తో సహజీవనం చేసిన మాట వాస్తవమే అని, జూన్ 8న సుశాంత్ నుంచి విడిపోయాయని, ఇద్దరం బ్రేకప్ చెప్పుకున్నామని రియా అంటోంది. అది జరిగిన వారానికే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈ వారం మధ్యలో ఏం జరిగిందో క్లారిటీ లేదు. సరిగ్గా జూన్ 8నే సుశాంత్ ఎకౌంట్ లోంచి 15 కోట్లు మాయం అయ్యాయి. అదెలా జరిగిందన్న విషయంపై ఇప్పుడు పోలీసులు విచారణ మొదలెట్టారు. ఈ కేసులో రియా సోదరుడి ప్రమేయం ఉందన్న కోణంలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుశాంత్ - రియా బ్రేకప్‌కి ముందు ఏం జరిగింది? ఆ పదిహేను కోట్లు ఏమయ్యాయి? అనే విషయాల్లో క్లారిటీ వస్తే గానీ అసలు నిజాలు అర్థం కావు.