ఈసారి చెన్నై రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగబోతున్నాయా? సినిమాలూ, రాజకీయాలూ ఏకం అవ్వబోతున్నాయా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి ఎన్నికలలో రజనీకాంత్ పోటీ చేయడం దాదాపు ఖాయం. ఇప్పుడు మరో స్టార్ హీరో విజయ్ కూడా.. పార్టీ స్థాపించి, ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోతున్నాడన్నది లేటెస్ట్ సమాచారం.
రజనీకాంత్ తరవాత తమిళనాట అంత క్రేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్. తన రాజకీయ ప్రవేశం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అందుకు ఇదే అనువైన సమయం అని... విజయ్ భావిస్తున్నాడట. విజయ్ తండ్రి, ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్ రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఈయన కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ పేరును నమోదు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ న్యాయవాదితో సంప్రదించినట్లు తెలిసింది. పార్టీ రిజిస్ట్రేషన్ గప్ చుప్‌గా చేసేసి, ఆ తరవాత... పార్టీ ప్రణాళికలు రచించి, ఒకేసారి... ప్రజల ముందుకు రావాలని విజయ్ భావిస్తున్నాడట. రజనీకాంత్ కంటే ముందు విజయ్ సమర శంఖం మోగించే ఆలోచనలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.