టాలీవుడ్ లో కొన్ని సంవత్సరాల క్రితం అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా, ఇప్పుడు బాలీవుడ్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. 2012 లో 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఇలియానా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ, అప్పుడప్పుడూ గ్లామరస్ పాత్రల్లో కూడా మెరుస్తుంది.
ఇలియానా అందరిలాంటి హీరోయిన్ కాదు. బాలీవుడ్ లో మిగతా హీరోయిన్స్ లా ఆమె తన ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టలేదు. వీలు కుదిరినప్పుడల్లా తన ప్రేమికుడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఆస్ట్రేలియా కు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్ర్యూ నీబోన్ తో ఇలియానా సహజీవనం చేస్తుంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు మనకి అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి.
తాజాగా ఇలియానా 'మిడ్-డే' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ప్రియుడి గురించి పలు విషయాలు చెప్పింది. అతని గురించి మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని, అతను మామూలుగా ఉండటానికి ఇష్టపడతాడని, అతని ప్రైవసీ కి భంగం కలిగించనని తెలిపింది.
నేను 11 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో ఉంటున్నాను. మాకు అభిమానుల నుంచి ఎంతో ప్రేమాభిమానాలు లభిస్తున్నాయి. అదే సమయంలో వారికి మాపై రెట్టింపు ద్వేషం కూడా కలుగుతుంది. ఇవన్నీ నా భాయ్ ఫ్రెండ్ భరించాలని నేను అనుకోను.
చాలామంది అతడు భారతీయుడు కాదని, ఎలా ప్రేమించావని అడిగేవారు. అందులో అసలు అర్ధమే లేదు. అతనంటే నాకెంతో ఇష్టం. ఎలాంటి ప్రమేయం లేకుండా నా కుటుంబం ఆరోపణలు ఎదుర్కోవటం నాకు ఇష్టం లేదు.
నాకు సంబంధించి పెళ్ళికి, సహజీవనానికి పెద్ద తేడాలేదు. ప్రస్తుతానికి తాము సహజీవనం లో గడుపుతూ ఆనందంగా ఉన్నామని, పెళ్ళితో చాలామంది జీవితాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ నా విషయంలో నా ప్రియుడి పై ఉన్న నమ్మకం ఎప్పటికీ మారదు అని చెప్పుకొచ్చింది ఇలియానా.
ప్రస్తుతం ఇలియానా నటించిన 'బాద్ షాహో' చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.