ఈ శ్రీరామ నవమికి బాక్సాఫీసు ముందుకొచ్చింది `దసరా`. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. దాంతో... శ్రీకాంత్ కి వరుస ఆఫర్లు అందుతున్నాయి. చాలామంది ప్రొడ్యూసర్లు శ్రీకాంత్ కి అడ్వాన్సులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. శ్రీకాంత్ భవిష్యత్తులో చాలా పెద్ద దర్శకుడు అవుతాడని... నాని విడుదలకు ముందే చెప్పాడు. ఇప్పుడు ఆ మాటే నిజం అయ్యేలా ఉంది.
సుకుమార్ నుంచి వచ్చిన శిష్యులు చాలామంది హిట్లు కొడుతున్నారు. బుచ్చిబాబు ఉప్పెనతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల వంతు వచ్చింది. రంగస్థలం సినిమాకి సహాయకుడిగా పనిచేశాడు శ్రీకాంత్. దసరాలో కూడా రంగస్థలం లక్షణాలు కనిపిస్తాయి. ఆ బ్యాక్ డ్రాప్, హీరో క్యారెక్టరైజేషన్, మాస్ అండ్ రస్టిక్ లుక్, పిక్చరైజేషన్, రాజకీయం నేపథ్యం, ఓ హత్యకు హీరో ప్రతీకారం తీర్చుకోవడం.. ఇవన్నీ.. రంగస్థలం ఎఫెక్ట్ తో తీసినట్టే అనిపిస్తుంది.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం... రంగస్థలం రిలీజ్ అయిన డేట్ నే.. దసరాని విడుదల చేశారు. 2018 మార్చి 30న రంగస్థలం విడుదలైంది. ఇప్పుడు అదే తేదీన .. దసరా రిలీజ్ అయ్యింది. ఇలా... చాలా విషయాల్లో సుకుమార్ ని కాపీ కొట్టాడు దర్శకుడు. ఎంతైనా శిష్యుడు కదా..?!