సెప్టెంబరు 2... పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పవన్ కెరీర్‌లో సూపర్ హిట్లుగా నిలిచిన జల్సా, తమ్ముడు సినిమాల్ని 4 కె ప్రింటుతో చూడాలన్నది అభిమానుల ఆశ. అందుకు తగిన ప్రయత్నాలూ జరిగిపోతున్నాయి. మహేష్ బాబు పుట్టిన రోజున ఇలానే పోకిరి సినిమాని ప్రదర్శిస్తే ఆ సినిమా కలక్షన్ల వారిగా కొత్త రికార్డుని సృష్టించింది. ఇప్పుడు అదే పంథాలో పవన్ సినిమాల్ని మళ్లీ చూడాలన్నది ఫ్యాన్స్ ఆశ. తమ్ముడు సినిమా వరకూ ఓకే. కానీ... `జల్సా` సినిమా ప్రింట్ల కోసమే పెద్ద గొడవ జరుగుతోంది ఇప్పుడు.
`జల్సా` ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ప్రింట్లు కావాలంటే గీతా ఆర్ట్స్ పర్మిషన్ కావాలి. కానీ... గీతా ఆర్ట్స్ మాత్రం అనుమతులు ఇవ్వడానికి నిరాకరిస్తోందని టాక్. ప్రింట్ ఇవ్వాలంటే దానికి డబ్బులు కట్టాల్సిందే అని గీతా ఆర్ట్స్ యాజమాన్యం చెబుతోందట. దాంతో.. ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పాత సినిమా ప్రింటుని ఇవ్వడానికి కూడా అల్లు అరవింద్ ఇలా కక్కుర్తి పడడమేంటని సోషల్ మీడియా వేదికగా మండి పడుతున్నారు. కొంతమంది పవన్ ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్‌కి వెళ్లి.. అల్లు అరవింద్ తో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు టాక్. కానీ వాళ్లెవరికీ అరవింద్ అందుబాటులో లేరు.
ఈ విషయంలో.. కనీసం త్రివిక్రమ్ జోక్యం చేసుకొని, జల్సా ప్రింటులు ఇప్పించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.